మారిషస్ బ్యాంకులో అప్పు తీసుకోలేదు
కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడి
సాక్షి,హైదరాబాద్: మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. కోర్టు నుంచి అరెస్టు వారెంటు జారీ అయిన నేపథ్యంలో శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వేరే కంపెనీకి తమ కంపెనీ కార్పోరేట్ గ్యారంటీ మాత్రమే ఇచ్చిందని, తాను వ్యక్తిగతంగా గ్యారంటీ ఇవ్వలేదన్నారు. తనకున్న ఒత్తిడి ప్రకారం..తమ లీగల్ కౌన్సిల్ సలహా మేరకు కోర్టు తనకు మినాహాయింపు ఇవ్వాలని కోరానని, అయినా వారంట్ ఇష్యూ చేశారని చెప్పారు. తాను సుజనా గ్రూప్‌కు వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని చెప్పారు. 2012లో అప్పు తీసుకున్నారని, 2014లో డిఫాల్ట్ అయ్యారని తెలిసిందన్నారు.
ఆఫ్రికాకు చెందిన కంపెనీలో తా ను డెరైక్టర్ని కూడా కాదని, అందులో తనకు ఒక శాతం కంటే తక్కువ వాటా మాత్రమే ఉందని చెప్పారు. ఆ కంపెనీ అప్పు తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నామని తెల్పారన్నారు. బ్యాంక్ లోన్ ఎప్పుడు కట్టాలో కంపెనీ బోర్డు చూసుకుంటుందని, తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయమన్నారు. దీని వల్ల తన రాజకీయ భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదన్నారు. తన రాజ్యసభ పదవి పార్టీ అవసరాన్ని బట్టి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని, దానికి కట్టుబడి ఉంటామని సుజనా చౌదరి స్పష్టం చేశారు.