వ్యాపారం అన్నాక కింద, మీద అవుతుంది: సుజనా
వ్యాపారం అన్నాక కింద, మీద అవుతుందని... లాభనష్టాలు సర్వ సాధారణమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. కోర్టు నుంచి ఆయనకు అరెస్టు వారంటు జారీ అయిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తాను సుజనా గ్రూపు వ్యవస్థాపకుడిని మాత్రమేనని, 2010 వరకు దానికి చైర్మన్‌గా ఉన్నానని చెప్పారు. 2010 నుంచి 2014 వరకు అందులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నాని అన్నారు. 2012లో అప్పు తీసుకున్నారని, 2014లో డిఫాల్ట్ అయ్యారని తెలిసిందన్నారు. ఇక మారిషస్ బ్యాంకులో తాను అప్పు తీసుకోలేదని, తమ కంపెనీ గ్యారంటీ కింద మాత్రమే ఉందని చెప్పారు.
తాను వ్యక్తిగతంగా కూడా గ్యారంటీ ఇవ్వలేదన్నారు. పైగా ప్రస్తుతం తనకు ఆ కంపెనీలో 1 శాతం కంటే తక్కువ షేర్ ఉందని చెప్పారు. వాళ్లు డబ్బు తీసుకున్న మాట వాస్తవమేనని, వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి కట్టలేకపోతున్నారని తెలిపారు. మోసం చేయాల్సిన అవసరం, చేసే అవకాశం కూడా లేవని ఆయన అన్నారు. వేరే కంపెనీకి తమ కంపెనీ ష్యూరిటీగా మాత్రమే ఉందన్నారు. ఈ విషయంలో కూడా తమ పార్టీ అధినేత సూచనల మేరకే నడుచుకుంటానని సుజనా చౌదరి అన్నారు. పార్టీ అవసరాన్ని బట్టి రాజ్యసభ అవకాశం ఎవరికి ఇవ్వాలనేది చంద్రబాబే నిర్ణయిస్తారని ఆయన తెలిపారు.