కేంద్ర పథకాల్లో డీబీటీ
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో డీబీటీ (నేరుగా లబ్ధి బదిలీ) పద్ధతిని అమలు చేస్తాం. ఇప్పటికే గ్యాస్ రాయితీ పంపిణీలో డీబీటీ అమలు చేయడంతో ఏటా ప్రభుత్వానికి రూ. 28 వేల కోట్లు ఆదా అవుతుంది. త్వరలో అన్ని పథకాల్లో డీబీటీ అమలు చేస్తే ప్రభుత్వానికి భారీ ఆదాతో పాటు లబ్ధిదారుడి ఖాతాకు రాయితీ నిధులు చేరతాయి. అవకతవకలకు తావుండదు’అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బుధవారం పీపుల్స్‌ప్లాజాలో డిజీ ధన్ మేళాను కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌తో కలసి ఆయన ప్రారంభించారు.
ఆ తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో తీసుకొచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకం లాటరీని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి తెరిచారు. విజేతలకు బహుమతులను, క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహించిన వారికి అవార్డులు అందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ కార్మికుల వేతనాల చెల్లింపులపై త్వరలో చట్టం తీసుకు వస్తామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాల్లో జమయ్యేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‘పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు కొంత ఇబ్బంది పడ్డా ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆర్‌బీఐ నుంచి రాష్ట్రానికి రూ. 32 వేల కోట్ల కొత్తనోట్లు వచ్చాయి. వీటిని అన్ని బ్యాంకులకు పంపిణీ చేశాం. రెండ్రోజుల్లో మరో 500 కోట్లు బ్యాంకులకు చేరతాయి.
కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం నోట్ల రద్దుపై గోల చేస్తున్నాయి. ప్రజలు వాటిని విశ్వసించరు’అని అన్నారు. మరో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మాట్లాడుతూ సాంకేతిక విప్లవం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, పేదల జీవనోపాధుల అభివృద్ధికి సాంకేతిక సేవలు దోహదపడుతున్నాయని అన్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ.. పలు గ్రామాలను ఇప్పటికే నగదురహిత గ్రామాలుగా రూపొందిస్తోందని అన్నారు.
బ్యాంకు ఖాతాకు నగదు ప్రోత్సాహకాలు...
నగదు రహిత లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులను ప్రోత్సహించేందుకు అమల్లోకి తెచ్చిన లక్కీ గ్రాహక్ యోజన పథకంలో విజేతలకు అన్‌లైన్ ద్వారా వారి బ్యాంకు ఖాతాకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు నీతి ఆయోగ్ సలహాదారులు అశోక్‌కుమార్ జైన్ తెలిపారు. లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి వారి బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామన్నారు. బుధవారం నాటి డ్రాలో 358 బ్యాంకులకు సంబంధించి 15వేల మంది విజేతలను ఆన్‌లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, గురువారం కూడా ఈ మేళాను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి పాల్గొన్నారు.