పోరు కత్తులా... పూల గుత్తులా... | chandrababu naidu and kcr campaign in greater elections | Sakshi
Sakshi News home page

పోరు కత్తులా... పూల గుత్తులా...

Published Thu, Jan 28 2016 2:33 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

పోరు కత్తులా... పూల గుత్తులా... - Sakshi

పోరు కత్తులా... పూల గుత్తులా...

ఎన్నికల బరిలోకి నేటి నుంచి ఇద్దరు సీఎంలు
 వేడెక్కనున్న గ్రేటర్ ఎన్నికల పోరు
‘మీట్ ది ప్రెస్’ ద్వారా ప్రజల్లోకి సీఎం కేసీఆర్
నేడు, రేపు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన
‘ఓటుకు కోట్లు’లో నాటి విమర్శలకు కట్టుబడతారా?
రాజకీయ అవసరాల కోసం రాజీపడ్డారన్న
జనం అభిప్రాయానికి బలం చేకూరుస్తారా?
ఆసక్తి రేపుతున్న ముఖ్యమంత్రుల ప్రచారం
30న పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ

 
సాక్షి, హైదరాబాద్:
బల్దియా బరి వేడెక్కబోతోంది.. ఇద్దరు చంద్రులు రంగంలోకి దిగనున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ‘గ్రేటర్’ ఫైట్‌కు కదలనున్నారు. ఒక నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఇద్దరు సీఎంలు ప్రచారానికి తరలిరానుండటం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ‘ఓటుకు కోట్లు’ కేసు నేపథ్యంలో ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న ఇద్దరు సీఎంలు ఇప్పుడేం మాట్లాడతారు? ఇద్దరి మధ్య మళ్లీ మాటల తూటాలు పేలుతాయా? ఒకరిపై ఒకరు కాలు దువ్వుతారా? లేక పైపై విమర్శలతో సరిపెడతారా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలివే!!
 
నాడు కత్తులు.. మరి నేడు?
గతేడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ టీడీపీ అడ్డంగా దొరికింది. స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ చంద్రబాబు స్వయంగా మాట్లాడిన ఆడియో టేపులు బయటపడడంతో వివాదం తారస్థాయికి చేరింది. ‘నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.. నగ్నంగా పట్టపగలే దొరికిన దొంగవు నువ్వు.. ఇంకా ఎక్కువ మాట్లాడితే తగిన శాస్తి జరుగుతుంది..’ అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. అటు ఏపీలో కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది.‘ఖబడ్దార్.. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం మీకెవరిచ్చారు.. నాకూ ఏసీబీ ఉంది.. వాళ్లూ హైదరాబాద్‌లోనే ఉన్నారు’ అంటూ బాబు మండిపడ్డారు.
 
 ఓటుకు కోట్లు కేసులో ఇక చంద్రబాబు రాజీనామా చేయకతప్పదేమోనని అంతా భావించారు. అటు ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కూడా ఇరుక్కున్నారని అనుకున్నారు. ఇంతలో వారిమధ్య ‘స్నేహం’ చిగురించింది. అమరావతి శంకుస్థాపనకు రావాలంటూ చంద్రబాబు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఇరువురు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. బాబు ఆహ్వానం మేరకు కేసీఆర్ అమరావతి వెళ్లొచ్చారు. అనంతరం అయుత చండీమహాయాగానికి రావాల్సిందిగా కేసీఆర్ కూడా బాబు నివాసానికి వెళ్లి ఆహ్వానించారు. ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడంతో కేసుల కథ కంచి చేరింది. ఇద్దరు నేతలు రాజీ పడ్డారని, అందుకే ఓటుకు కోట్లు కేసు, ట్యాపింగ్ కేసు అటకెక్కాయన్న అభిప్రాయం కూడా జనంలో వ్యక్తమైంది.
 
ఈ నేపథ్యంలో వారిద్దరూ మళ్లీ పాత కేసులను ప్రస్తావిస్తూ పరస్పర విమర్శలకు దిగుతారా లేదా అభివృద్ధి నినాదానికే పరిమితమై లాలూచీ కుస్తీకి దిగుతారా? అన్న ఆసక్తి నెలకొంది. పైపై విమర్శలకే పరిమితమైతే  తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఇరువురు నేతలు పక్కా ఆధారాలు లభించిన ఇంతటి కీలకమైన కేసులను పక్కనపెట్టారన్న అభిప్రాయానికి మరింత బలం చేకూరినట్టవుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. లాలూచీ పడడం వల్లే ఏపీ సచివాలయం, అధికార యంత్రాంగాన్ని హుటాహుటిన అమరావతికి తరలించేందుకు బాబు యత్నిస్తున్నారని, అలాగే తెలంగాణలో కేవలం టీడీపీ కేడర్‌ను సంతృప్తి పరిచేందుకే గ్రేటర్‌లో పోటీకి దిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుందని వారు చెబుతున్నారు.
 
 హైదరాబాద్ అభివృద్ధిపై ఏమంటారు?
 హైదరాబాద్ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, హైటెక్ సిటీ నిర్మాణం తన గొప్పేనని ఇప్పటికే పలుమార్లు ఏపీ సీఎం చెప్పుకోవడాన్ని కేసీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే ప్రధాన హామీగా ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్.. ఏపీ సీఎంకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందో అన్న అంశంపై చర్చ జరుగుతోంది. అటు టీఆర్‌ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’తో న లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకుంటూ నగరంలో పార్టీ ఉనికే లేకుండా ప్రణాళికలు రచిస్తున్న టీఆర్‌ఎస్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న అంశం కూడా ఆసక్తిగా మారింది. మొత్తంగా ఇప్పుడు గ్రేటర్ ప్రచారంలో ‘ఇద్దరు చంద్రులు’ ఎలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తారన్న దానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
 
 ఇదీ నేతల ప్రచార షెడ్యూల్..
 గురు, శుక్రవారాల్లో చంద్రబాబు ప్రచార షెడ్యూల్, రూట్ మ్యాప్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ గురువారం ‘మీట్ ది ప్రెస్ ’ ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. 30వ తేదీ (శనివారం)న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. చంద్రబాబు గురుువారం మధ్యాహ్నం 2.30కు మెదక్ జిల్లా పటాన్‌చెరు బస్టాండ్‌లో బహిరంగ సభ ద్వారా ప్రచారం మొదలుపెట్టనున్నారు. అక్కడ్నుంచి రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్ సర్కిల్, చందానగర్, కూకట్‌పల్లి, బాలానగర్ క్రాస్‌రోడ్స్, ఎర్రగడ్డ ఫ్లైఓవర్, కృష్ణకాంత్ పార్క్, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు, కృష్ణానగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, మాదాపూర్, హైటెక్‌సిటీ, శిల్పారామం వరకు రోడ్‌షో సాగనుంది.
 
 రాత్రి 9 గంటల వరకు సాగే ఈ ప్రచారం పూర్తిగా శివార్లు, సీమాంధ్ర ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలకే పరిమితం కావడం గమనార్హం. 2014 ఏప్రిల్ సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లకే పరిమితం కాగా.. వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు విడతల వారీగా టీఆర్‌ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement