బాబు జైలుకెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్!
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ఇద్దరు సీఎంలు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒక అవగాహనకు వచ్చారనడానికి అనేక తార్కాణాలు ఉన్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డా. మల్లు రవి అన్నారు. ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టారన్నారు. వీరిద్దరూ కూడా పరస్పరం ఒకరి సలహాలు, సూచనలపై మరొకరు పనిచేస్తున్నారన్నారు. ఒకరికి ఇబ్బంది వచ్చినపుడు మరొకరు ఆదుకుంటున్నారని ఆరోపించారు.
వీటిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక భూమికను పోషించిన సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డిని అవమానించేలా మాట్లాటడం సరికాదన్నారు. బుధవారం గాంధీభవన్‌లో పార్టీ అధికారప్రతినిధి ఇందిరా శోభన్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు డెరైక్షన్‌లో కాంగ్రెస్ పనిచేస్తోందని మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమైనవన్నారు.
కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసిన సందర్భాలు ఎప్పుడూ లేవని మల్లు రవి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లి చంద్రబాబును పొగడడం, పట్టీసీమ ప్రాజెక్టును మెచ్చుకోవడం, కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి చంద్రబాబు రావడం వంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయన్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తన వ్యాఖ్యల ద్వారా హరీష్‌రావు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.