ఇచ్చింది తీసుకుంటాం... కావాల్సింది అడుగుతాం
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ముందుగా కేంద్రం ఇచ్చింది తీసుకుంటాం. ఆ తర్వాత కావాల్సింది అడుగుతాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, తదనంతర పరిణామాలపై ఆయన గురువారం శాసన మండలిలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెప్పిందన్నారు. హోదా వల్ల కలిగే లాభాలన్నీ ఇస్తామని హామీ ఇచ్చిం దన్నారు. అయితే, ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలని, దీనికొక సమయం కేటాయించి ఆలోగా చెయ్యాలని కేంద్రాన్ని కోరుతానన్నారు.
రెవెన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు కదా!
‘‘పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ.1,800 కోట్లు ఖర్చు చేశాం. దీనికి పూర్తిస్థాయిలో సాయం అందజేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. తిరుపతిలో నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, నేను ప్రత్యేక హోదా గురించి చెప్పింది వాస్తవమే. కానీ, సాంకేతిక సమస్యలున్నాయి. అయినా హోదా వల్ల కలిగే ప్రయోజనాలతో సమానంగా ప్యాకేజీ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చింది. మరో రూ.1,000 కోట్లు సకాలంలో ఇవ్వాలని కోరాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం రూ.3,979.50 కోట్లు ఇచ్చింది. మిగతా సొమ్మును కూడా వాయిదాల రూపంలో ఇస్తామని చెప్పింది. ప్యాకేజీ కింద వెనుకబడిన ప్రాంతాలకు 1,050 కోట్లు ఇస్తామంది’’ అని తెలిపారు.
హోదాతో లాభాలేంటో చెప్పండి?
ప్రత్యేక హోదా పేరు ఎత్తాలంటేనే ముఖ్యమంత్రి భయపడుతున్నారని ప్రతిపక్ష సభ్యులు సి.రామచంద్రయ్య తదితరులు చంద్రబాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. మీరు ప్రత్యేక హోదా అని మాట్లాడుతున్నారు, అసలు హోదా వల్ల కలిగే లాభాలేంటో చెప్పండి? అంటూ చంద్రబాబు వారిపై మండిపడ్డారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు పెంచాలని కేంద్రాన్ని కోరామని చంద్రబాబు గురువారం శాసన మండలిలో చెప్పారు.