హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయాల్లో ఇప్పుడు ‘ఐ లవ్ మై జాబ్’ అనే స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి.
హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయాల్లో ఇప్పుడు ‘ఐ లవ్ మై జాబ్’ అనే స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం తమ వద్దకు వచ్చే వారితో ఉద్యోగులు మార్యాదగానూ వ్యవహరిస్తున్నారట! ఇదంతా నూతన కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ ప్రక్షాళణకు చేపట్టిన చర్యల్లో భాగంగా వస్తున్న సత్ఫలితాలు. ప్రతీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని ప్రేమించినప్పుడే ఉత్తమ సేవలు అందించగలుగుతాడని భావించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి పలు చర్యలు చేపట్టారు.
ఉద్యోగుల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించటం, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడం, మర్యాదగా వ్యవహరించడం, విద్యుత్ ఆదా చేయడం కోసం... ‘ఐ లవ్ మై జాబ్’, ‘మర్యాదగా మాట్లాడుకుందాం’, ‘యాక్ట్ నౌ’, ‘సేవ్ ఎనర్జీ’ నినాదాలతో కూడిన స్టిక్కర్లను తయారు చేయించి అన్ని సర్కిల్, జోనల్ కార్యాలయాలకు పంపిణీ చేయించారు. ప్రస్తుతం ఈ స్టిక్కర్లు ఉద్యోగుల టేబుళ్ల వద్ద దర్శనమిస్తున్నట్లు తెలుస్తోంది.