
ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు షురూ
రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ పోలీసుల తనిఖీలు మొదలయ్యాయి. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీ కాలేజీల్లో విద్యాశాఖ అధికారులతో కలసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల్లో విజిలెన్స్ పోలీసుల తనిఖీలు మొదలయ్యాయి. తొలి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 14 డిగ్రీ కాలేజీల్లో విద్యాశాఖ అధికారులతో కలసి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందుకుంటున్న అన్ని ప్రైవేటు కాలేజీల్లో నెలకొన్న లోటుపాట్లపై పోలీసులతో తనిఖీలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించడం, దీనిపై అభ్యంతరం తెలుపుతూ పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అయితే కాలేజీల్లో నేరుగా పోలీసుల దర్యాప్తు కాకుండా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులివ్వడంతో అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మున్ముందు తనిఖీలను ఉధృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
క్షుణ్ణంగా పరిశీలన...
ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తొలి రోజు ప్రైవేటు కాలేజీల్లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కాలేజీలు నిర్వహిస్తున్న కోర్సులు, బోధనా సిబ్బంది సంఖ్య, వారి అర్హతలు, మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌లు, అడ్మిషన్ల విధానం, స్కాలర్‌షిప్‌ల మంజూరు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందుతున్న విద్యార్థుల వివరాలు తదితర అంశాలపై ఆరా తీశారు.
8 యూనిట్లు.. 14 బృందాలు
రాష్ట్రంలో మొత్తం ఎనిమిది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం యూనిట్లు ఉండగా తొలిరోజు తనిఖీలకు అవి 14 బృందాలుగా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోని మూడు యూనిట్లతోపాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలతో కూడిన హైదరాబాద్ రూరల్ యూనిట్‌కు చెందిన సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కాలేజీలలో తనిఖీలు నిర్వహించారు. అలాగే మిగతా ఏడు జిల్లాల పరిధిలో ఉన్న 4 యూనిట్ల సిబ్బంది ఎనిమిది బృందాలుగా ఏర్పడి కాలేజీలలో తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో తనిఖీ బృందాల సంఖ్యను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,800 ప్రైవేటు కాలేజీలన్నింటినీ తనిఖీ చేయాలని యోచిస్తున్నారు.
విద్యాసంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
రాష్ట్రంలోని విద్యాసంస్థలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రకరకాల కోర్సులను ఆఫర్ చేస్తున్న కాలేజీలు నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నాయా లేదా అనే అంశాన్ని తనిఖీల్లో పరిశీలిస్తున్నాం. విద్యాశాఖ అధికారుల సూచనలు, సలహాల మేరకు వారి ఆధ్వర్యంలోనే విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. యువతను అత్యుత్తమ మ్యాన్‌పవర్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోంది. నాసిరకం చదువుల వల్ల డిగ్రీలు లభిస్తున్నాయే తప్ప సరైన ఉపాధి లభించడంలేదు. కాబట్టి కాలేజీల్లో నాణ్యత పెంచడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. అందుకు అనుగుణంగానే మా చర్యలు కొనసాగుతాయి.
- రాజీవ్ త్రివేది,విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్