
జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి: చెవిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సభలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ మార్షల్ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సహచర ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలసి మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కోర్టు ఆదేశాన్ని సైతం లెక్కచేయకుండా.. రోజాను సభలోకి రానీయకపోవడం సమంజసం కాదన్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయాల్సిన అవసరం లేదనుకోవడం, తమ తీర్పులే అంతిమమని భావించడం అహంకారమని మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై తమ నిరసనను తెలిపేందుకు ప్రతిపక్ష నేత అసెంబ్లీలో రెండు నిమిషాలు మైక్ అడిగినా ఇవ్వలేదని ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విరుచుకుపడ్డారు. టీడీపీకి అధికార అహంకారం తలకెక్కిందని, ప్రజాస్వామ్యాన్ని అధికారపక్ష నేతలు ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. మహిళా శాసనసభ్యుల పట్ల కూడా వారికి గౌరవం లేదని రోజా విషయంలో స్పష్టమైందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీపైనా, రోజాపైనా వ్యక్తిగత కక్షతోనే ఆమెను సస్పెండ్ చేశారని ఆరోపించారు.