బలవంతంగా ఏపీ ఎమ్మెల్యే తరలింపు
అమరావతి: రవాణాశాఖ బాలసుబ్రహ్మణ్యంపై దౌర్జన్యం చేసిన టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ వెలుపల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపే హక్కు లేదంటూ ఆయనను మార్షల్స్ లాక్కెళ్లారు. పోలీసులు, మార్షల్స్ ను వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ నాలుగో నంబరు గేటు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చెవిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించారు. ఆయనను మంగళగిరి తరలించనున్నారని సమాచారం.
సీఎం చంద్రబాబు అసెంబ్లీకి చేరుకున్నాక పరిణామాలు చకాచకా మారిపోయాయి. దీక్ష చేస్తున్న చెవిరెడ్డిని చూస్తూ అసెంబ్లీలోకి వెళ్లిన 10 నిమిషాల తర్వాత మార్షల్స్ రంగంలోకి దిగారు. బలవంతంగా చెవిరెడ్డిని తరలించారు. ఐపీఎస్ అధికారిపై దాడి చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని అంతకుముందు చెవిరెడ్డి ప్రకటించారు. తప్పుడు కేసుల్లో తనను ఇరికించారని, మీడియా సాక్షిగా దాడి చేసిన టీడీపీ నాయకులపై ఎందుకు కేసులు నమోదు చేయరని ఆయన ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి:
ఏపీ అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యే దీక్ష