ప్రశాంతంగా చేప ప్రసాదం పంపిణీ
అబిడ్స్/గన్‌ఫౌండ్రీ: మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిని సోదరులు చేపట్టిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7.39 గంటలకు బత్తిని కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, న్యూ ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వేలాదిమంది చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. ఈ కార్యక్రమం గురువారం ఉదయం వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
సైడ్ లైట్స్..
మధ్యాహ్నం నుంచి ప్రసాదం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. వికలాంగులకు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో వీఐపీలకు ప్రత్యేక కౌంటర్ చేప ప్రసాదం స్వీకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సీసీ కెమెరాల ద్వారా నిఘా....మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు డీసీపీ కమలాసన్ రెడ్డి స్వీయ పర్యవేక్షణ.... పంపిణీకి 32 కేంద్రాల ఏర్పాటు. దాదాపు 50 వేల చేపపిల్లలను విక్రయించినట్లు అధికారుల వెల్లడి. వైద్య శాఖ ఆధ్వర్యంలో నాలుగు ఆరోగ్య శిబిరాలు 108 అంబులెన్స్‌ల ద్వారా అత్యవసర చికిత్స మోజంజాహి మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ మీదుగా నాంపల్లికి వెళ్లే వాహనాలను అబిడ్స్ మీదుగా, గోషామహల్ నుంచి వచ్చే వాహనాలను దారుస్సలాం మీదుగా మళ్లించారు.
బద్రి విశాల్ పిత్తి, అగర్వాల్ సేవా దళ్, అగర్వాల్ సేవా సమాజ్, పంజాబ్ సేవా సమితి, జైశ్వాల్ సమాజ్‌లతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఆస్తమా రోగులకు అన్ని రకాల అల్పాహారాలు అందించాయి. హైదరాబాద్ మెట్రో వాటర్‌బోర్డ్ ఆధ్వర్యంలో 3 లక్షల వాటర్ ప్యాకెట్ల పంపిణీ చేశారు. ఎగ్జిబిషన్ మైదానం ప్రవేశం ద్వారం చేపప్రసాదం అశాస్త్రీయమని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్యానర్లు ఏర్పాటు చేశారు.