నేడే ‘జల పాఠం’!
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గురువారం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి శాసనసభ అధికారులు బుధవారం రాత్రి ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రజెంటేషన్‌కు తాము హాజరు కావడం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించింది. సంప్రదాయాలు, నిబంధనలకు విరుద్ధంగా సీఎం సాగిస్తున్న ఈ కార్యక్రమంలో తాము భాగస్వాములు కాలేమని ఆ పార్టీ నేత జానారెడ్డి, ఇతర సభ్యులు స్పీకర్‌కు లేఖ రాశారు.
శాసనసభ వేదికకు బదులుగా కమిటీ హాల్‌లో కార్యక్రమం ఏర్పాటు చే స్తే హాజరవుతామని ఆ లేఖలో పేర్కొంది. ఇక టీడీపీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం ఉదయం 9.30 గంటల్లోగా తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఆ వెంటనే సీఎం ప్రజెంటేషన్ మొదలు పెడతారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం రాత్రి స్పీకర్ మధుసూదనాచారి, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చర్చించారు.
ఏర్పాట్లు ఇవీ..
అసెంబ్లీలో సభ్యులు, స్పీకర్‌కు వేర్వేరుగా స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. స్పీకర్ ఎదురుగా ఒక స్క్రీన్, స్పీకర్‌కు కుడి, ఎడమల పక్కన మరో రెండు స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. సీఎం కేసీఆర్ తన స్థానం నుంచే కంప్యూటర్ ద్వారా ప్రజెంటేషన్ ఇస్తారు. నీటిపారుదల శాఖ సుమారు 107 స్లైడ్స్‌తో ప్రజెంటేషన్ నివేదికను సిద్ధం చేశారు. శాసన మండలి సభ్యులను అసెంబ్లీ గ్యాలరీకి తీసుకురాడం సాంకేతికంగా సరికాదన్న ఆలోచనతో మండలిలో సైతం ఇవే ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీలు అంతా మండలిలోనే సీఎం ప్రజెంటేషన్ లైవ్ టెలీకాస్ట్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మూడున్నర గంటల పాటు సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం. తర్వాత సుమారు గంటన్నర సేపు భోజన విరామం ప్రకటించి, తిరిగి సభ ప్రారంభించాక సభ్యులకు చర్చించే అవకాశం ఇస్తారు. అనంతరం ముఖ్యమంత్రి సమాధానంతో కార్యక్రమం ముగిస్తారు.
ప్రజెంటేషన్ ఇలా..
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం, వివక్షను, ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించేలా నీటి పారుదల శాఖ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సిద్ధం చేసింది. సుమారు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా రూ.లక్ష కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులు, వాటికి నిర్దేశించిన సమయం, ప్రాజెక్టుల వారీగా నిర్ణయించిన ఆయకట్టు వివరాలను ఇందులో పొందుపరిచారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టుల వివరాలు, గతంలో ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన జీవోలు, వందేళ్ల గత చరిత్ర ఆధారంగా నీటి లభ్యత వివరాలు, గత పాలకుల హయాంలో జరిగిన ఒప్పందాలను సీఎం వివరించనున్నారు.
1956- 2016 వరకు సాగునీటి పరిధిలో పారిన నిధులు, నీళ్లు, సాగైన ఆయకట్టును వివరిస్తూ మొత్తంగా 5 విభాగాలుగా దాదాపు 107 స్లైడ్‌లలో ప్రజెంటేషన్‌ను సిద్ధం చేశారు. మొదటి విభాగంలో ఉమ్మడి రాష్ట్రావతరణ నుంచి ఇప్పటివరకు నిర్మించిన ప్రాజెక్టులు, జరిగిన పనులు, చేసిన ఖర్చు ప్రస్తావిస్తారు. రెండో భాగంలో దేవాదుల, ఇందిరమ్మ వరద కాల్వ, ప్రాణహిత చేవెళ్ల, దుమ్ముగూడెం, కంతనపల్లి ప్రాజెక్టుల పరిధిలో రీ ఇంజనీరింగ్ అవసరాలను పొందుపరిచారు. మూడో భాగంలో జిల్లాల వారీగా సాగు వివరాలు, లక్ష్యాలు వివరిస్తారు. నాలుగో భాగంలో మిషన్ కాకతీయ, ఐదో భాగంలో నిధులు, వాటికి పూర్తికి తీసుకునే సమయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. బుధవారం ఉదయం నుంచీ రాత్రి పొద్దుపోయే వరకు ప్రజంటేషన్‌పై సీఎం కేసీఆర్ మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌తో పాటు అన్ని జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెట్లతో తుది కసరత్తు చేశారు.