మంత్రులు ప్రాజెక్టుల బాట
ప్రాజెక్టుల వెంట కలియ తిరిగిన మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి
గద్వాల: ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ను జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి శనివారం పరిశీలించారు. బృందంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజ్, రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన పనులను ప్యాకేజీల వారీగా కలియతిరిగి చూశారు. గద్వాల, గట్టు, ధరూరు, ఇటిక్యాల మండలాల పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. గట్టు మండలం ముచ్చోనిపల్లె రిజర్వాయర్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఖరీఫ్‌లో ప్రాజెక్టుల నుంచి 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. ఇందులో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం నుంచి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు 3 రోజుల ప్రాజెక్టుల బాట లో భాగంగా మొదట నెట్టెంపాడు పనులను పరిశీ లించినట్లు చెప్పారు. నేడు జిల్లాకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వస్తారని వివరించారు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా భూములు కోల్పోయిన రైతులకు కొత్త జీవో ప్రకారం ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ. 4.50 లక్షలు చెల్లిస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. గతంలో చూపిన అలైన్‌మెంట్ సర్వేలలో కాకుండా వేరే సర్వే నంబర్లలో కాల్వ పనులు చేపడుతున్నారని, తద్వారా రైతులు నష్టపోతున్నారని మంత్రులకు పలువురు వివరించారు. రీ సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని జూపల్లి అధికారులను ఆదేశించారు.