కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలి
నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులను ప్రజలు తరిమికొట్టాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కరీంన గర్‌లో జరిగిన స్కూటర్ ర్యాలీలో ఆయన పాల్గొ న్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలో 46 వేల చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్‌బండ్ నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణను సస్యశ్యామలం చేసేందు కు రూ. 25 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గోదావరి నీటివృథాను అరికట్టి మంథని ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి సీఎం కేసీఆర్ మేడిగడ్డ నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఒక్క ప్రాజెక్టు నిర్మాణాన్ని సైతం పూర్తి చేయలేకపోయిందని విమర్శిం చారు. కాళేశ్వర ఎత్తిపోతలకు పైప్‌లు తెప్పించి కమీషన్లు పట్టుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ నేతలదని హరీశ్ అన్నారు. వచ్చే ఏడాదిలోపు కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 40 వేల ఎకరాలకు సాగునీరందిస్తామని, కరీంనగర్ జిల్లాను మరో కోనసీమగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే టీటీడీపీ నేతలు రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.