మీరెక్కువా.. మేమెక్కువా?
♦ సంక్షేమ నిధుల ఖర్చుపై అసెంబ్లీలో సంవాదం
♦ లక్ష కోట్లు ఎలా ఖర్చు చేస్తారు: సీఎల్పీ నేత జానారెడ్డి ప్రశ్న
♦ చివరి మూడు నెలల్లోనే ఎక్కువ ఖర్చు: ఈటల
సాక్షి, హైదరాబాద్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రయోజనం చేసిందంటే.. తమ ప్రభుత్వమే మేలు చేసిందంటూ అసెంబ్లీలో మంత్రి ఈటల, కాంగ్రెస్ నేత జానారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. తొలుత జానారెడ్డి మాట్లాడుతూ.. ‘‘2013-14లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి రూ.4,091 కోట్లు ఖర్చు చేసింది. 2014-15లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తొలి పదినెలల్లో రూ.3,377 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఏడాది మొత్తంలో రూ.4,051 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సంక్షేమానికి మీరెన్ని నిధులు ఖర్చు చేశారో అర్థమవుతోంది.
అసలు 2015-16 బడ్జెట్‌కు సంబంధించి జనవరి నెలాఖరు వరకు రూ.73వేల కోట్లు మాత్రమే ఖర్చయింది. మిగిలింది రెండు నెలలే. మొత్తం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని ఎలా చెబుతున్నారు..’’ అని ప్రశ్నించారు. దీనికి మంత్రి ఈటల సమాధానమిస్తూ.. ఆడిటర్ జనరల్ మూడు నెలలకోసారి లెక్కలు ఇస్తారని, డిసెంబర్ నాటికి రూ.66 వేల కోట్లు ఖర్చయిందని చెప్పారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఎక్కువ ఖర్చు కావడం సహజమని, అందుకే రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామనే నమ్మకం తమకుందని పేర్కొన్నారు. సంక్షేమానికి గడిచిన ఆరేళ్ల కేటాయింపులను విశ్లేషిస్తూ 2013-14లో రూ.4,091 కోట్లు కేటాయించారని.. తమ ప్రభుత్వం 2015-16లో మూడింతలుగా రూ.11,392 కోట్లు కేటాయిం చిందని చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న జానా.. ‘‘ఈఏడాది లెక్కలొస్తే అందులో ఖర్చు సంగతి మాట్లాడుకోవచ్చు. ముందుగా మీరు చెప్పింది చాలు.
తొలి ఏడాది ఖర్చు చూస్తే మీ కంటే మా ప్రభుత్వమే ఎక్కువ ఖర్చు చేసింది..’ అని చురక అంటించారు. కాగా, తాగునీటి కోసం ప్రతిజిల్లాకు 200కోట్లు కేటాయించాలని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఆశావర్కర్ల జీతాలను పెంచాలని సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య విజ్ఞప్తి చేశారు.