'విదేశీ పర్యటనలతోనే బాబు కాలం వెళ్లదీస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బాబు ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
రాయలసీమకు నీరందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని తులసిరెడ్డి అన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లుయినా రాయలసీమకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. సీమకు నీరు ఇవ్వకపోతే ప్రజలను మోసం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. నీటి కోసం సీమ రైతులు ఎదురుచూస్తున్నారని... ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ఏపీలోని 45 రిజర్వాయర్లు బాబు హాయాంలో వట్టి కుండల్లా మారయని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారన్నారు. ఆస్పత్రుల్లో పందులు, కుక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను పీక్కుతింటున్నాయని, పుట్టిన పిల్లలను దొంగలు ఎత్తికెళ్లిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.