ఆయన ద్వి‘భాషి’...!
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డికి తెలుగుభాష లోనే రెండు రకాల భాషలు వస్తాయట. ఆయన ప్రసంగశైలిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తెలుగులోనే మాట్లాడినా వినేవారికి అయోమయం, గందరగోళం కలిగించే విధంగా, ఏం చెప్పారో అర్థంకాకుండా మాట్లాడటం జానా రెడ్డికి వచ్చునట. అందరికీ అర్థమయ్యేవిధంగా మాట్లాడటంలోనూ ప్రావీణ్యముందట.
విషయం అర్థమయ్యేటట్టు చెప్పాల్నా, అర్థంకాకుండా అటూఇటూ తిప్పి చెప్పాల్నా అనేదానిపై సారుకు ఉన్న స్పష్టతను బట్టి భాషను ఉపయోగిస్తారట. చెప్పిందే తిప్పితిప్పి చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా అర్థంకాని పడికట్టు పదాలతో కూడిన తెలుగుభాషను అయోమయం చేయాలనుకుంటే ప్రయోగిస్తారట. చెప్పాలనుకున్నప్పుడు సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారట. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం సందర్భంగా సాధారణ భాషలో మాట్లాడి, పార్టీలో పరువును నిలబెట్టుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.