సాక్షి, హైదరాబాద్: 'నల్లగొండ జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించడం దురదృష్టకరం. . జిల్లా పట్ల సానుకూలంగా ఉన్నాం. ఫ్లోరైడ్ నిర్మూలనకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారు' అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులపై ఆదివారం శాసనసభ స్వల్ప వ్యవధి ప్రశ్నల సమయంలో నల్లగొండ ఎమ్మెల్యే(కాంగ్రెస్) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతి, స్థితిగతులను వివరించారు. వర్షాలు కురిస్తే వచ్చే ఖరీఫ్‌లో లో లెవల్ కెనాల్ కింద 50 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తామన్నారు.
నల్లగొండ, ఖమ్మం జిల్లాల మంత్రులు జి.జగదీష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి రెండురోజులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు హెడ్ టూ టేయిల్ వరకు కట్టమీద తిరిగి ఆధునికీకరణ పనులను పరిశీలించానన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 35 శాతం పనులే చేస్తే, ఏడాదిలోనే 50 శాతం పనులు చేశామన్నారు. మిగిలిన 10 శాతం పని ఏడాదిలోగా చేస్తామన్నారు. నీటి సంఘాల ప్యాకేజీ పనులకు గత ప్రభుత్వం టెండర్లూ పిలవలేదని, తాము టెండర్లు పిలిచి అప్పుడే 65 శాతం పనులు చేశామన్నారు. ఈ ప్రాజెక్టుపై ఏడాదిలోనే రూ.570 కోట్లను ఖర్చు చేశామన్నారు. జిల్లాలో చిన్న నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఉన్నా, గతంలో అక్కడ పర్యవేక్షక ఇంజనీర్(ఎస్‌ఈ) పోస్టూ లేదన్నారు. తాము వచ్చాకే ఒక ఎస్‌ఈతో పాటు మూడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను కేటాయించామన్నారు.
జిల్లాలో చెడిపోయిన ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి మళ్లీ ఆయకట్టును స్థిరీకృతం చేస్తున్నామన్నారు. మూడు నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఉదయ సముద్రం పనులను పునరుద్ధరించి వేగంగా చేస్తున్నామన్నారు. 2277 ఎకరాల సేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహకరిస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వ లైనింగ్ జరగక 3500 క్యూసెక్కులకు బదులు 2500 క్యూక్కులే పారుతున్నాయన్నారు.
ప్రధాన కాల్వ లైనింగ్‌కి రూ.220 కోట్లు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్ల లైనింగ్‌కి రూ.280 కోట్లు కలిపి మొత్తం రూ.500 కోట్లు అవసరమన్నారు. సీఎం కేసీఆర్ పరిశీలనలో ఈ ప్రాజెక్టు ఉందన్నారు. గత ప్రభుత్వం ఏఎమ్మార్పీ ప్రాజెక్టులోని ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను తొలగించి టెండర్లు పిలిచిందని, సాధ్యమైతే మళ్లీ ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను పెట్టేందుకు పరిశీలిస్తామన్నారు. ఎన్నికల వేళ తప్పా ఇతర సమయాల్లో తాను ఎన్నడూ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బదులిచ్చారు. కేవలం ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను విస్మరించారనే తాను సవతి తల్లి ఆరోపణ చేశానన్నారు.
హైదరాబాద్‌కి తాగునీటి ప్రాజెక్టుగా ఏమ్మార్పీ మారుతోంది: జానారెడ్డి
ఏమ్మార్పీ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రాజెక్టుగా మారేప్రమాదం ఉందని కాంగ్రెస్‌శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద 2లక్షల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికే 60 వేల నుంచి 70 వేల ఎకరాలు బీడుగా మారయన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో కొద్దిగా నిర్లక్ష్యంగా జరిగింది వాస్తవమేనని, ఈ ప్రభుత్వమైనా సరిగ్గా కృషిచేస్తే రెండేళ్లలో పనులు పూర్తి అవుతాయన్నారు.
సుంకిశాల నుంచి హైదరాబాద్‌కు త్రాగునీటిని తరలించేందుకు రూ.900 కోట్ల రుణాన్ని జైకా మంజూరు చేసిన గత ప్రభుత్వాలు కావాలనే పక్కన పెట్టాయన్నారు. ఇప్పుడు వ్యయం రూ.1200 కోట్ల నుంచి రూ.1300 కోట్లకు పెరిగిందని, పురపాలక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తే ఏఎమ్మార్పీ నీళ్లు పూర్తిగా ఆయకట్టుకు సరఫరా అవుతాయన్నారు. ఏమ్మార్పీ టన్నెల్ లైనింగ్ పనులు నెలకు 0.5 కి.మీలకు మించి చేయడం సాధ్యం కావడం లేదన్నారు. నల్లగొండ జిల్లా నీటి అవసరాల కోసం కృష్ణాబోర్డు 4.5 టీఎంసీలను కేటాయించిందని, అవసరమైనప్పుడు విడుదల చేస్తామన్నారు.
కన్నతల్లే సవతి ప్రేమ చూపించింది
Published Sun, Mar 27 2016 9:50 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement