ఎస్సైపై దాడికి యత్నించిన కానిస్టేబుళ్లు
Published Tue, Sep 5 2017 9:05 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
♦నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి వీరంగం
సాక్షి, హైదరాబాద్: నిమజ్జనానికి వినాయకుడిని తరలించే క్రమంలో ముగ్గురు కానిస్టేబుళ్లు ఆదివారం రాత్రి వీరంగం సృష్టించారు. ఓ ఎస్‌ఐతో పాటు మరో కానిస్టేబుల్‌పై దాడికి యత్నించారు... రహ్మత్‌నగర్‌లోని బంగారుమైసమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆదివారం రాత్రి నిమజ్జనానికి తరలిస్తుండగా సెక్టారు ఎస్సై కురుమూర్తి, సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. ఇప్పటికే ఆలస్యమైనందున త్వరగా విగ్రహాన్ని తీసుకెళ్లాలని ఎస్సై వారికి సూచించారు. దీంతో అక్కడున్న ముగ్గురు వ్యక్తులు తాము కూడా పోలీసులుగా పనిచేస్తున్నామని, ఎందుకు త్వరపెడుతున్నారంటూ వాదనకు దిగారు.
అంతేగాక తాము అలానే నృత్యాలు చేస్తామని, ఏం చేస్తారో చేసుకోండంటూ ఎదురుతిరిగారు. ఎస్సైతోపాటు జూబ్లీహిల్స్ ఠాణా కానిస్టేబుల్ రాజేష్ నిలువరించేందుకు ప్రయత్నించగా వారు దాడికి ప్రయత్నించారు. అనంతరం ఎస్సై ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించారు. దాడికి యత్నించినవారు బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, చిలకలగూడ ఠాణాలలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఘటనపై ఇప్పటికే కానిస్టేబుల్ రాజేష్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ పోలీసులను వివరణ కోరగా అలాంటిదేమి లేదని.. మాటమాట పెరిగింది తప్ప ఎలాంటి గొడవ జరగలేదన్నారు.
Advertisement
Advertisement