సర్కారు వైఫల్యాలను ఎండగడతాం
టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీపీఐ, సీపీఎం
- రాష్ట్రావిర్భావ వేడుకలు నిర్వహిస్తూనే సర్కారు క్రియాశూన్యతను నిలదీస్తాం: చాడ, తమ్మినేని
- ఫిరాయింపుల్లో కేసీఆర్‌కు వందకు వంద మార్కులని ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. జూన్ 2న రాష్ట్రావిర్భావ వేడుకలను పార్టీలపరంగా నిర్వహిస్తూనే ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని సభలు, సమావేశాల ద్వారా నిలదీయనున్నాయి. సమస్యల పరి ష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపనున్నాయి. ఈ అంశంపై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ‘సాక్షి’తో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
సామాజిక న్యాయమేదీ?: తమ్మినేని
రెండేళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి ఎలా జరగాల్సి ఉండగా కేసీఆర్ ప్రభుత్వం ఏ మేరకు చేసిందో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తామని తమ్మినేని తెలిపారు. ‘‘ఏవో కొన్ని పెన్షన్లు ఇచ్చి, రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి చేసినట్లు కాదు. ఇది ఏ ప్రభుత్వమైనా చేయగలదు’’ అని ఆయన మండిపడ్డారు. ప్రధానంగా సామాజిక న్యాయం విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ర్టంలో 90 శాతమున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి ఇచ్చిన హామీలను సర్కారు ఏమాత్రం నెరవేర్చలేదని విమర్శించారు.
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ భారీగా ప్రచారం చేసినా ఆచరణలో అది ముందుకు సాగడం లేదన్నారు. ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించినా, రీ డిజైన్ మతలబు ఏమిటన్న దానిపై తీవ్రంగానే ఆరోపణలున్నాయన్నారు. చట్ట ప్రకారం పరిహారం, పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి 4-5 లక్షల ఎకరాల భూమిని లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తమ్మినేని ఆరోపించారు. ఇది అభివృద్ధి వైపు పయనించే ప్రభుత్వం కాదని తమ అభిప్రాయమని, రాబోయే మూడేళ్లలోనైనా ప్రభుత్వం పద్ధతులు మార్చుకోవాలని ఒత్తిడి తెస్తామన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో కేసీఆర్‌కు 20-30 మార్కులే: చాడ
టీఆర్‌ఎస్‌లోకి ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్‌కు వందకు వంద మార్కులు పడతాయని చాడ వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాభివృద్ధి, మిగతా అంశాల్లో మాత్రం ఆయనకు 20-30 మార్కులే పడతాయని వ్యాఖ్యానించారు. రెండేళ్ల పాలనలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తామన్నారు. ‘‘టీఆర్‌ఎస్ పాలనలోని లోటుపాట్లను సెమినార్లు, సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తాం. జూన్ 2న మఖ్ధూం భవన్ సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో రాష్ట్రావిర్భావ వేడుకలు జరుపుతాం. అదే రోజు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ప్రగతి రథం స్పీడెంత? అనే అంశంపై సదస్సు నిర్వహిస్తాం. రాష్ర్ట సాధనలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన పాత్ర గురించి ప్రజలు, కార్యకర్తలకు తెలియజేస్తాం’’ అని చాడ తెలిపారు.