సాక్షి, హైదరాబాద్: బడాబాబులకు రుణమాఫీ చేయడంపై సీపీఎం తీవ్రంగా మండిపడింది. నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు బ్యాంకులు, పోస్టాఫీసులవద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నగదు ఇబ్బందులను పరిష్కరించేందుకు వెంటనే మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేసి కొత్త రూ.500, 100 నోట్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసింది. విజయ్ మాల్యా సహా 63 మంది బడాబాబుల రూ.7వేల కోట్ల మొత్తాన్ని రాని బాకీలలోకి మార్చడం సరి కాదని సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యు డు జి.నాగయ్య గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు పాతనోట్లను అన్ని రకాల క్రయవిక్రయాలకు అనుమతించాలని, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సరిపడా కరెన్సీతో కౌంటర్లు, సిబ్బందిని పెంచాలన్నారు. నోట్ల మార్పిడి, విత్‌డ్రాయల్ పరిమితిని పెంచాలన్నారు. నిర్మాణాత్మక చర్యలు చేపట్టి నల్లధనాన్ని వెలికితీసి సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాలన్నారు.