ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు | crime in hyderabad city | Sakshi
Sakshi News home page

ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు

Published Wed, May 14 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు

ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు

 అభం శుభం తెలియని పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు. జీడిమెట్ల పరిధిలో చిన్నారి భవ్య.. ఓ యువకుడి చేతిలో దారుణహత్యకు గురైంది. తెలిసిన వారిదే ఈ ఘాతుకమని భావిస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో.. పదేళ్ల కార్తీక్‌ను గత నెలలో కిడ్నాప్ చేసిన దగ్గరి బంధువైన యువకుడు.. ఆ బాలుడిని షాద్‌నగర్‌లో పాశవికంగా హతమార్చి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు.   

షాపూర్‌నగర్, న్యూస్‌లైన్: ఇంట్లో ఇంటరిగా ఉన్న బాలికను ఓ దుర్మార్గుడు అతి కిరాతకంగా హతమార్చాడు. మొదట వైరు, ఆపై లుంగీతో మెడకు ఉరి బిగించి హత్యచేసి పరారయ్యాడు. జీడిమెట్ల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకి చెందిన గోవిందరావు, భారతి దంపతులు న్యూ షాపూర్‌నగర్‌లో ఉంటూ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె భవ్య (11) స్థానిక ఎస్వీ మోడల్ హైస్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది.

మంగళవారం తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా భవ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 10.30 సమయంలో ఓ యువకుడు (25) భవ్య ఉండే గది వైపు వెళ్తుండగా ఇంటి కింది పోర్షన్‌లో ఉండే యజమాని కల్పన ఎక్కడికి వెళ్తున్నావని అతనిని ప్రశ్నించింది. ఈ క్రమంలో భవ్యను కూడా కల్పన అడిగి నిర్ధారించుకున్న తరువాత అతనిని పైకి పంపింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమానంతో పైకి వెళ్లిన కల్పన.. భవ్య గదికి బయట నుంచి గడియ పెట్టి ఉండడం చూసి ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లిందేమోనని భావించింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చిన గోవిందరావు గడియ తీసుకుని లోనికెళ్లగా గదిలో భవ్య విగత జీవిగా పడి ఉంది. మెడకు లుంగీ బిగించి ఉంది. పక్కనే సెల్ ఛార్జింగ్ వైరు ఉంది. ఆ స్థితితో కుమార్తెను చూసి గోవిందరావు కుప్పకూలిపోయాడు.
 
 తెలిసిన వారి పనేనా?
 తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో జీడిమెట్ల సీఐ సుదర్శన్ దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా?, కుటుంబ నేపథ్యం వంటివి ఆరా తీస్తున్నారు. ఆ యువకుడు తనకు తెలుసని బాలిక భవ్య.. ఇంటి యజమాని కల్పనకు చెప్పడాన్ని బట్టి ఇది తెలిసిన వారి పనేననే నిర్ధారణకు వచ్చారు.

చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: పోలీసుల నిర్లక్ష్యం బాలుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారని... రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు నెల రోజులుగా మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో పదేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఏప్రిల్ 5న కిడ్నాపైన బాలుడు షాద్‌నగర్‌లో బంధువు చేతిలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్‌కు చెందిన జీహెచ్‌ఎంసీలో పనిచేసే రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10). అలియాబాద్‌లోని స్ఫూర్తి కాన్సెప్ట్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా గతనెల 5న ఇంటి ముందు ఆడుకుంటుండగా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఛత్రినాక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బాలుడి తల్లి సుజాత సోదరుడి కుమారుడు శివకుమార్ (22) వీరింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు.
 
మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్  మండలం తాళ్లగూడం గ్రామానికి చెందిన శివకుమార్ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. రెండు నెలల క్రితం తనకు రూ. 10,000 కావాలని కార్తీక్ తల్లి సుజాతను అడిగాడు. దీనికామె ససేమిరా అంది. డబ్బులు ఎందుకు అడిగావని శివకుమార్‌ను అతని నానమ్మ కూడా మందలించింది. ఈ విషయాలన్నింటిని మనసులో ఉంచుకున్న శివకుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. కార్తీక్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించాడు.

ఇందులో భాగంగానే ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్‌ను కిడ్నాప్ చేసి షాద్‌నగర్‌కు తీసుకెళ్లాడు. షాద్‌నగర్ రైల్వేస్టేషన్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి రాత్రి 9 గంటల సమయంలో బాలుడి  తలపై గ్రానైట్‌రాయితో మోది హత్య చేశాడు. అనంతరం బాలుడి ఒంటి పైనుంచి దుస్తులను తొలగించి వాటిని తీసుకొని తిరిగి ఫలక్‌నుమాకు చేరుకున్నాడు. ఆ దుస్తులను ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కనే ఉన్న కట్టమైసమ్మ దేవాలయం వద్ద దాచి పెట్టి యథావిధిగా బాలుడి తల్లిదండ్రుల ఇంటికి అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నాడు.

ఏప్రిల్ 6వ తేదీన నగరానికి వెళుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన శివకుమార్ కూకట్‌పల్లికి వెళ్లి కాయిన్‌బాక్స్‌తో ఉదయం 10 గంటల సమయంలో సుజాతకు ఫోన్ చేసి ‘నీ కుమారుడు నా వద్దే ఉన్నాడని...రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తానని’ బెదిరించాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా కూకట్‌పల్లిలోని కాయిన్‌బాక్స్‌ను గుర్తించారు. అక్కడే ఉన్న సీసీ కెమెరా పుటేజ్ సాయంతో ఆ పరిసరాల్లో శివకుమార్ తచ్చాడినట్లు తేలింది.  దీంతో పోలీసులు శివకుమార్‌ను విచారించగా.. బాలుడి కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదనడంతో పోలీసులు అతన్ని వదిలేశారు. మళ్లీ శివకుమార్‌ను మరోసారి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో బాలుడిని తానే చంపినట్లు సోమవారం రాత్రి పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు మృతదేహం ఫోటోలను చూపగా వారు తమ కుమారుడేనని గుర్తించారు.
 
 దు:ఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యులు
 వివాహమైన పదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ను శివకుమార్ హత్య చేయడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. నిత్యం అందరితో ఆడుతూ పాడుతూ గడిపే కార్తీక్ లేడన్న విషయం తెలుసుకొని స్థానికులు కూడా కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement