
జిల్లాల్లో గ్రూప్-2 నిర్వహణ బాధ్యత జేసీలదే
• కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్
• పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో నిర్వహించనున్న గ్రూప్-2 రాత పరీక్షలకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. పరీక్షల నిర్వహణ పనులను దగ్గరుండి చూసుకునే బాధ్యతలను జాయింట్ కలెక్టర్లకు అప్పగించాలని, జిల్లాల్లో జేసీలే పరీక్ష నిర్వహణ అధికారులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని.. నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు.
ఇన్విజిలేటర్ల సమస్య ఉన్నచోట రిటైర్డ్ లెక్చరర్లను నియమించాలని, భవనాల సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు భవనాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహిస్తున్న కేంద్రాలకు సంబంధించిన విద్యా సంస్థలకు ఆ రెండు రోజులు సెలవులివ్వాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీసు శాఖ అవసరమైన బందోబస్తు కల్పించాలని, బస్సు సదుపాయాలను ఆర్టీసీ ఏర్పాటు చేయాలన్నారు.
ఈ అంశాలన్నింటిపై బుధ గురువారాల్లో లిఖిత పూర్వకంగా మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాల గుర్తింపు పూర్తయిందని, మరో రెండు రోజుల్లో ఆ జిల్లాల్లోనూ పూర్తవుతుందని సీఎస్‌కు కలెక్టర్లు వివరించారు. సమావేశంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు.