
పండ్ల బుట్టలను లాక్కెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుల అరాచకమంటూ బుధవారం సోషల్ మీడియాలో ఫొటోలు రావడం ఉప్పల్‌లో సంచలనం సృష్టించింది. ఉప్పల్ నల్ల చెరువు కట్టపై పండ్లను అమ్ముకుంటున్న చిరువ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు రెండు రోజుల క్రితం తమ ప్రతాపం చూపారు. గంపలను లాక్కోవడంతో పాటు వారి వద్ద ఉన్న పండ్లను, వేరుశెనగ కాయలను బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించుకున్నారు. వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా పోలీసులు కనికరించలేదు. ఇది గమనించిన ఓ యువకుడు పోలీసుల దాష్టీకాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి బుధవారం వాట్స్‌యాప్‌లో పెట్టడంతో ఈ వార్త ట్రాఫిక్ పోలీసులను ఉక్కిరి బిక్కిరి చేసింది.
ట్రాఫిక్ సీఐ జానకిరెడ్డి వివరణ...
ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుండటంతో రోడ్డును ఆక్రమించి పండ్లు అమ్ముతున్న వ్యాపారులను ముందస్తుగా హెచ్చరించాం. అయినా వారు వినిపించుకోకపోవడంతో అక్కడి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఇందులో మేం చేసిందేమీ లేదు.