కాంగ్రెస్‌లో చెల్లక.... కారెక్కనున్న దానం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తన మాటే నెగ్గాలని దానం పెట్టిన షరతులను కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించకపోవడంతో ఇక ఆయన కారెక్కడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. సోమవారం మరో పది మంది కార్పొరేటర్ల అనుచర గణంతో టీఆర్‌ఎస్‌లో చేరడానికి కార్యక్రమం ఖరారైంది. త్వరలో రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ నాయకత్వం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆయా పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఇందులో భాగంగా కొద్ది రోజులుగా దానం నాగేందర్‌తోనూ మంతనాలు సాగిస్తున్నట్టు తెలిసింది. గురువారం రాత్రి కూడా టీఆర్‌ఎస్ నేతలు డి. శ్రీనివాస్, మంత్రి హరీష్‌రావులతో పాటు మరికొందరు నేతలు దానంతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. టీఆర్‌ఎస్ ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో దానం కాంగ్రెస్ నాయకత్వంతో బేరసారాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌లో కొనసాగాలంటే గ్రేటర్ ఎన్నికల్లో తన మాటే చెల్లుబాటు కావాలని, జీహెచ్‌ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో కాంగ్రెస్ టికెట్లు ఖరారు చేసే బాధ్యత తనకే కట్టబెట్టాలని షరతు పెట్టారు. లేదంటే పార్టీ వీడివెళుతానన్న సంకేతాలు కాంగ్రెస్ నాయకత్వానికి పంపించారు. దానం పెట్టిన షరతులకు కాంగ్రెస్ ససేమిరా అంది. 150 డివిజన్ల పరిధికి చెందిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఇంచార్జీలు ఉన్నారని, ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలు అభ్యర్థులను సూచిస్తారని, ఆ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని కాంగ్రెస్ తేల్చిచెప్పింది.
దాంతో ఇక టీఆర్‌ఎస్‌లో చేరాలన్న నిర్ణయానికి దానం వచ్చారు. అయితే తనతో పాటు పార్టీలో చేరబోతున్న వారికి గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ ఖాయం చేయాలని దానం కోరగా అందుకు టీఆర్‌ఎస్ నేతలు అంగీకరించినట్టు సమాచారం. అందుకు టీఆర్‌ఎస్ సమ్మతించడంతో దానం శుక్రవారం తన అనుచరణగణంతో సమావేశమయ్యారు. తనకు సన్నిహితంగా ఉంటున్న దాదాపు 10 మంది మాజీ కార్పొరేటర్లను సమావేశపరిచి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కారెక్కడానికి సోమవారం ముహూర్తం నిర్ణయించుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇలావుండగా, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన 150 డివిజన్లకు సంబంధించి తన మాట చెల్లుబాటు కావాలని కోరిన విషయం నిజమేనని శుక్రవారం దానం మీడియా ముందు అంగీకరించారు.