హైకోర్టు విభజన విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చొరవ తీసుకోవాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో ఉన్న లీవ్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వేగవంతం అయ్యేలా చూడాలని కోరారు. అలాగే న్యాయవాదుల కేటాయింపు విషయంలో చోటు చేసుకున్న సమస్యపై కేంద్రం తీసుకుంటున్న చర్యల వల్ల మంచి సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు.
బుధవారమిక్కడ బాల్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైకోర్టు విభజన కోసం కేంద్రం చొరవ తీసుకుంటోందని, అదే విధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలన్నారు. హైకోర్టు నిర్మాణం విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. తాజాగా కేంద్రహోం, న్యాయశాఖ మంత్రులను కలిసి తాజా పరిస్థితిని వివరించినట్లు చెప్పారు. మరోసారి ఈనెల 8న న్యాయశాఖ మంత్రిని సమస్యను వివరించి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడిస్తామన్నారు. అదే విధంగా సమస్యల పరిష్కారం కోసం న్యాయాధికారులు చేసిన సమ్మె కాలాన్ని సెలవు రోజుగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
9న దత్తాత్రేయ చైనా పర్యటన
హైదరాబాద్: జీ-20దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఈ నెల 9న చైనా వెళ్తున్నారు. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు సాగే సమావేశాల్లో కార్మికశాఖ అంశాలపై జరిగే చర్చల్లో ఆయన పాల్గొంటారు.