తగ్గుతున్న తెలుగు మీడియం స్కూళ్లు
► ఐదేళ్లలో 3,700 నుంచి 2 వేలకు తగ్గిన సంఖ్య
► అదే స్థాయిలో పెరిగిన ఆంగ్ల మాధ్యమ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు క్రమంగా డిమాండ్ పడిపోతోంది. అదే సమయంలో ఆంగ్ల మీడియం స్కూళ్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలోనూ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు కావాలంటూ తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రంలో 29 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ విద్యా సంవత్సరంలో సుమారు 500 వరకు ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను విద్యాశాఖ ప్రారంభించింది. వీటికితోడు ఆరో తరగతి నుంచి 182 మోడల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మీడియం బోధనను కొనసాగిస్తోంది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి ప్రీ ప్రైమరీ విద్యను తీసుకురావాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తే ప్రభుత్వ రంగంలోనూ భారీగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య పెరగనుంది.
మరోవైపు ప్రైవేటు రంగంలోనూ తెలుగు మీడియం స్కూళ్ల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాశాఖ లెక్కల ప్రకారం 2011-12 విద్యా సంవత్సరం నుంచి 2015-16 విద్యా సంవత్సరం వరకు దాదాపు 2 వేల వరకు తెలుగు మీడియం స్కూళ్లు తగ్గిపోగా, ఇంగ్లిష్ మీడియంలో దాదాపుగా ఆ మేరకు పాఠశాలల సంఖ్య పెరిగింది. విద్యాశాఖ ప్రస్తుతం తెలుగు మీడియం స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చుకునేందుకు (కన్వర్షన్) అవకాశం కల్పించడంతో ప్రైవేటు రంగంలో ఆంగ్ల మాధ్యమం స్కూళ్ల సంఖ్య మరింత పెరగనుంది.
మూడేళ్లుగా టెన్త్ పరీక్షల్లోనూ మారిన పరిస్థితి...
గత మూడేళ్లుగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో తెలుగు మీడియంకటే ఇంగ్లిష్ మీడియంలో హాజరయ్యే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013-14లో తెలుగు మీడియం విద్యార్థులు 2,50,073 మంది పరీక్షలకు హాజరుకాగా, ఇంగ్లిష్ మీడియంలో 2,36,998 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2014-15 విద్యా సంవత్సరంలో 2,44,448 మంది తెలుగు మీడియం విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలు రాశారు. 2015-16 విద్యా సంవత్సరంలో టెన్త్ రాసిన తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య 2,24,040కి తగ్గగా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసిన వారి సంఖ్య 2,82,682కి పెరిగింది.
ఇదీ ప్రైవేటు పాఠశాలల పరిస్థితి
సంవత్సరం తెలుగు ఇంగ్లిష్
మీడియం మీడియం
2011-12 3,728 8,142
2012-13 3,588 8,885
2013-14 3,100 9,872
2014-15 2,658 9,726
2015-16 2,000 9,882