సీట్ల పెంపు పేరిట ఫిరాయింపులు
టీఆర్ఎస్, టీడీపీపై బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చిన అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ దుర్వినియోగపరుస్తున్నాయని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కె. లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మంచిది కాదని సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ పేర్కొన్నారు. పాలనా సౌలభ్యం.. ప్రజల అవసరాల కోసం చట్టంలో పొందుపర్చిన సీట్ల పెంపు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు.
అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించామని తెలిపారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నమ్మి ప్రజలు గెలిపించారని, అయితే అవి ఇంకా కార్యరూపం దాల్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, అందువల్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే ప్రయత్నం చేస్తామని లక్ష్మణ్ చెప్పారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణలో ఎంపీ, ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా పెరిగేలా కృషి చేస్తామన్నారు. మే మూడో వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తారని, 2019 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణలో పార్టీ పనిచేయడానికి దిశానిర్దేశం చేస్తారని లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 22న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి.. 23 నుంచి జిల్లాల్లో పర్యటిస్తామని లక్ష్మణ్ చెప్పారు.
అమరవీరులకు నివాళులు: ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌పై గ్రామస్థాయి నుంచి పోరాటం నిర్మిస్తామని లక్ష్మణ్ ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన తర్వాత జాతీయ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రులతో సమావేశం కావడానికి ఢిల్లీ వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. విమానాశ్రయం నుంచి తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం దాకా భారీ ర్యాలీ నిర్వహించారు.