యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్! | Detective active career | Sakshi
Sakshi News home page

యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్!

Published Sat, Oct 25 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్!

యాక్టివ్ కెరీర్‌కు.. డిటెక్టివ్!

నేరాలను, నేరస్థులను గుర్తించడంలో షెర్లాక్ హోమ్స్ చూపిన ప్రతిభాపాటవాలు మనల్ని అబ్బురపరుస్తాయి. కల్పిత పాత్రే అయినా డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులున్నారు. నేరాలు ఘోరాలు, అవినీతి అక్రమాలు నానాటికీ పెరిగిపోతున్న ఆధునిక కాలంలో డిటెక్టివ్‌ల అవసరం కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుత సమాజంలో అపరాధ పరిశోధకులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అందుకే అపరాధ పరిశోధనను కెరీర్‌గా ఎంచుకుంటే అద్భుతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను, క్లయింట్ల అభిమానాన్ని సొంతం చేసుకోవచ్చు.  
 
పరిశోధకులకు చేతినిండా పని

అపరాధ పరిశోధకులకు డిటెక్టివ్ ఏజెన్సీలు, న్యాయ సేవా సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కౌన్సిళ్లు, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో అవకాశాలున్నాయి. కేసుల ముడి విప్పేందుకు న్యాయవాదులు, పోలీసులు కూడా డిటెక్టివ్‌ల సహాయం కోరుతుంటారు. విడాకులు, దత్తత, తప్పిపోయినవారిని గుర్తించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టడం.. వంటి వ్యవహారాల్లో వీరి ప్రమేయం తప్పనిసరి. సమాజంలో అభద్రతాభావం, నేరాలు ఉన్నంతకాలం అపరాధ పరిశోధకులకు చేతినిండా పని దొరుకుతుంది. డిటెక్టివ్‌లో తమ వృత్తిలో పేరు తెచ్చుకోవాలంటే అన్ని అంశాల్లో ఎంతోకొంత పరిజ్ఞానం అవసరం. లా, సైకాలజీ, సోషియాలజీ, టోపోగ్రఫీ, ఆయుధాలు, కెమిస్ట్రీ, జియాలజీ, ఫిలాసఫీ, అనాటమీ వంటి సబ్జెక్టులపై అవగాహన పెంచుకోవాలి. ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, పరిజ్ఞానం, అనుభవంతోపాటు సేవలను మార్కెట్ చేసుకొనే నైపుణ్యంపైనే డిటెక్టివ్‌ల విజయం ఆధారపడి ఉంటుంది.
 
కావాల్సిన నైపుణ్యాలు: డిటెక్టివ్‌లకు మంచి పరిశీలన, విశ్లేషణ నైపుణ్యాలు ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ పెంచుకోవాలి. న్యాయ పరిజ్ఞానం అవసరం. నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే లక్షణం ముఖ్యం. మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. చేపట్టిన బాధ్యతలను పూర్తిచేసేందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓర్పు, సహనం అలవర్చుకోవాలి. వెర్బల్, రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఈ వృత్తిలో సవాళ్లు, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. వీటిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి.
 
 అర్హతలు: డిటెక్టివ్‌గా మారేందుకు ప్రత్యేకంగా విద్యార్హతలు అంటూ లేవు. అయితే, కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తిచేయడం మంచిది. క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ వంటి కోర్సులు చేసినవారు అపరాధ పరిశోధకులుగా వృత్తిలో రాణించొచ్చు. క్లయింట్లను మెప్పించడానికి, మెరుగైన సేవలు అందించడానికి మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ స్కిల్స్ ఉండాలి. డ్రైవింగ్ లెసైన్స్ ఉండడం తప్పనిసరి. డిటెక్టివ్‌గా మారాలనుకునేవారు మొదట ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ల వద్ద సహాయకులుగా చేరి, అనుభవం సంపాదించాలి. తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ డిటెక్టివ్స్ అండ్ ఇన్వెస్టిగేటర్స్, కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేటర్స్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ డిటెక్టివ్స్ వంటి సంస్థల వెబ్‌సైట్లలో ఔత్సాహికులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.
 
 వేతనాలు:  అపరాధ పరిశోధకులు తమ అనుభవం, పనితీరు ఆధారంగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రారంభంలో ఏడాదికి రూ.1.25 లక్షల నుంచి రూ.2.5 లక్షలు ఆర్జించే అవకాశం ఉంది. న్యాయ పరిజ్ఞానం ఉన్న డిటెక్టివ్‌లకు కార్పొరేట్ సంస్థల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభిస్తుంది. ఈ రంగంలో అనుభవాన్ని బట్టి సీనియర్ ఇన్వెస్టిగేటర్, టీమ్ మేనేజర్ స్థాయికి చేరుకోవచ్చు.
 
 కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
 ఢిల్లీ యూనివర్సిటీ వెబ్‌సైట్: www.du.ac.in/du/
 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ-ఆగ్రా
 వెబ్‌సైట్: www.dbrau.ac.in
 యూనివర్సిటీ ఆఫ్ మైసూరు
 వెబ్‌సైట్: www.unimysore.ac.in
 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. వెబ్‌సైట్: జ్ట్టిఞ://nicfs.nic.in/
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement