
ఎంసెట్ లీకేజీలో కొత్త పేరు
► 2005 ఎయిమ్స్ ప్రశ్నపత్రం లీకు వీరుడు ధర్మకూ పాత్ర
► గాలిస్తున్న మూడు ప్రత్యేక బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ధర్మ అలియాస్ ధర్మేంద్ర అనే వ్యక్తికి ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ధర్మ గతంలో పలు ప్రశ్నపత్రాల లీకేజీల్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది. ముఖ్యంగా 2005లో ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా ఎంసెట్ లీకేజీలోనూ కీలకపాత్ర పోషించినట్లు సీఐడీకి ఆధారాలు లభ్యమయ్యాయి.
కీలక బ్రోకర్లు గుడ్డూ, ఇక్బాల్, రాజగోపాల్‌రెడ్డి, రాజేశ్‌లతో ధర్మ తరచూ ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ధర్మను అదుపులోకి తీసుకుంటే ఎంసెట్ లీకేజీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధర్మను పట్టుకొనేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, ముంబై, చండీగఢ్‌లలో గాలిస్తున్నాయి.
ముకుల్‌జైన్ అరెస్టు
ఇక ఈ కుంభకోణంలో ఢిల్లీకి చెందిన బ్రోకర్ ముకుల్ జైన్‌ను సీఐడీ అరెస్టు చేసింది. అతను సబ్ బ్రోకర్లు చంద్రశేఖర్‌రెడ్డి, రాజేశ్, షకీరాల ద్వారా ఆరుగురు విద్యార్థులకు కోల్‌కతాలో శిక్షణ ఇప్పించినట్లు విచారణలో వెలుగు చూసింది. అయితే కోల్‌కతాలోని ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని మరో బ్రోకర్ మోహిత్ కుమార్ సింగ్ నిర్వహించినట్లు గుర్తించింది. అతడిని కూడా అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.