దళితుల విశ్వాసం పొందకుంటే కష్టమే: దిగ్విజయ్
అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో దిగ్విజయ్‌సింగ్
వారిని ఓటు బ్యాంకుగా చూడకూడదని వ్యాఖ్య
కేసీఆర్.. దళిత సీఎం సంగతేంది?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు తొలి నుంచీ అండగా ఉంటున్న దళితుల విశ్వాసం పొందకపోతే ఇక ముందు కష్టమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను టీపీసీసీ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా దిగ్విజయ్‌సింగ్ మాట్లాడారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం జీవితాంతం పరితపించిన అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, మైనారిటీలకు న్యాయం జరిగిందని చెప్పారు. దళితులను ఓటు బ్యాంకుగా చూడకూడదన్నారు. దళితవాడలకు వెళ్లాలని, వారితో చర్చలు జరపాలని, వారితో కలసి తిరుగుతూ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో బెల్లయ్య నాయక్ చేరిక
లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్య రాజకీయాలకు వేదిక అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దళిత సీఎం మాటేమైంది?: ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రానికి దళితుడినే తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్ ఇచ్చిన మాట ఏమైందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక కొనడానికి భూమి దొరకడం లేదనడం దళితులను మోసం చేయడం కాదాని నిలదీశారు. దళితులపై కేసీఆర్ బూటకపు ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు మనుస్మృతి ఇరానీగా మారిపోయారని ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. సమాజానికి ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాల్సిన యూనివర్సిటీలను ఏబీవీపీకి అడ్డాగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సామాజిక ప్రజాస్వామ్యాన్ని ఎలుగెత్తి చాటిన మహా మేధావి అంబేడ్కర్‌ను కేవలం దళితులకే నాయకుడనే ధోరణితో కొందరు చూడటం బాధాకరమని కొప్పుల రాజు వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ పోరాట ఫలితమే దళితులకు దక్కుతున్న అవకాశాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. బాంచెన్ బతుకుల వివక్ష నిర్మూలనకు అంబేడ్కర్ జీవితాంతం కృషి చేశారని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. అట్టడుగు వర్గాలకు అధికారం అంబేడ్కర్ పుణ్యమేనని షబ్బీర్ అలీ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాజాన్ని కలుషితం చేస్తోందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఆరోపించారు. కుల రహిత, స్త్రీ-పురుష సమానత్వం కోసం చివరివరకూ పోరాడిన మహానేత అంబేడ్కర్ అని కొనియాడారు. టీపీసీసీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు సర్వే సత్యనారాయణ, వివిధ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.