ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చేవాడా?: ఉత్తమ్
- హామీల అమలు కోసం పోరాడుతాం
- ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్
- ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెచ్చేవాడా..?
- రుణమాఫీని పట్టించుకోని సీఎం: ఉత్తమ్
ఖమ్మం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన జన ఆవేదన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో ఎన్‌డీఏ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. కేవలం ఇచ్చిన మాట కోసమే, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న కేసీఆర్ తెలంగాణ తెచ్చుడు సాధ్యమయ్యేదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, అది చెప్పేందుకే డిల్లీ నుంచి ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు అహం వీడి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ ఇవ్వాలని అనేక సార్లు అడిగినా సీఎం కేసీఆర్ పట్టించుకోవడంలేదన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని, ఎస్సీ, ఎస్టీల రుణాల సబ్సిడీ విడుదల చేయకుండా మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలోని ప్రజల సొత్తుతో దేవుడికి ఆభరణాలు చేయిస్తూ తన మొక్కులు తీర్చుకుంటున్నాడని ఆరోపించారు. ఎవరబ్బ సొత్తని రూ.5 కోట్ల ఆభరణాలు ఇచ్చాడని ప్రశ్నించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాలు వరంగల్, ఖమ్మం జిల్లాలకు అందించే కంతనపల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు.
కేవలం 28 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ప్రాణిహిత–చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.86 వేల కోట్లకు పెంచారని, 11 మాసాలలో పూర్తి చేశామని చెప్పిన భక్తరామదాసు ప్రాజెక్టు గతంలో ఉన్న ప్రాజెక్టులను ఆసరాగా చేసుకుని రూ.380 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియా మాట్లాడుతూ 2019లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు. కర్ణాటక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరువల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఏఐసీసీ పరిశీలకులు విష్ణునా«థ్, మాజీ కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, పోరిక బలరాంనాయక్, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రులు సంబాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, యూత్‌కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌యాదవ్ పాల్గొన్నారు.
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ధ్వజం
సాక్షి, సూర్యాపేట: అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని హిందూ, ముస్లిం మధ్య చిచ్చుపెట్టేలా ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. గురువారం సూర్యాపేటలో ఆయన విలేకరుతో మాట్లాడారు. ప్రధాని చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. యూపీ ఎన్నికల్లో మత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంతకాలం మైనార్టీలు అంటేనే గిట్టని మోదీ.. ఇప్పుడు మదర్సాలకు రూ.15 లక్షల కేటాయిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ నిర్వహించే శిశుమందిర్‌లను మదర్సాలతో పోల్చడం సరికాదన్నారు.