డిఫ్తీరియా పంజా యమ డేంజర్.. | diphtheria disease is most dangerous | Sakshi
Sakshi News home page

డిఫ్తీరియా పంజా యమ డేంజర్..

Published Wed, Aug 28 2013 2:25 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM

diphtheria disease is most dangerous

 వ్యాధి కారకం: కార్న్ బ్యాక్టీరియం డిఫ్తీరియా
 మాధ్యమం: గాలి ద్వారా సోకుతుంది.
 కారణాలు: అపరిశుభ్ర పరిసరాలు
 లక్షణాలు
 జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన దగ్గు,గొంతు వాపు, గొంతులో టాన్సిల్స్
 ముక్కు నుంచి నీరు కారడం, శ్వాస తీసుకోలేక పోవడం ,మెడ వాపు వస్తే అది బుల్ నెక్
 డిఫ్తీరియా. ఇది ప్రాణాంతకమైంది
 
 గ్రేటర్‌పై డిఫ్తీరియా (గొంతువాపు వ్యాధి) పంజా విసురుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడగా.. మరో 33 మంది పిల్లలు ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత జలాలు, చెడిపోయిన ఆహార పదార్థాల్లో త్వరగా వృద్ధి చెందే కార్న్ బ్యాక్టీరియం డిఫ్తీరియా కోరలు చాచడంతో ఈ వ్యాధి ప్రబలుతోంది. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, చాదర్‌ఘాట్, రాజీవ్‌నగర్, యాఖుత్‌పురా, గోపన్‌పల్లి తదితర ప్రాంతాల్లోని పలువురు చిన్నారులకు వ్యాధి లక్షణాలు బయటపడడంతో ఆయా ప్రాంతాల వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ పరిస్థితి దాపురించినట్లు పలువురు విమర్శిస్తున్నారు.
 
 గచ్చిబౌలి, రాయదుర్గం, నల్లకుంట, న్యూస్‌లైన్:
 డిఫ్తీరియా బాధితులతో నగరం అట్టుడికిపోతోంది. ఫీవర్ ఆస్పత్రిలో రోజురోజుకూ రోగులు పెరిగి పోతు న్నారు. ఈ వ్యాధి బారిన పడి గోపన్‌పల్లికి చెందిన ఆరేళ్ల వైశాలి, నాలుగేళ్ల ప్రభు సోమవారం మృతి చెందగా.. చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ వీధికి చెందిన మహ్మద్ రఫీ కుమారుడు ఫారూక్ (6) మంగళవారం మృతి చెందారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ప్రస్తుతం 33 మంది డిఫ్తీరియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. సోమవారం ఒకేరోజు ఏడు కేసులు నమోదయ్యాయి. వీరిలో శేరిలింగంపల్లి గోపన్నపల్లి, రాజీవ్‌నగర్‌కు చెందిన వేణు కూతురు సంగీత(10), వెంకటేశ్ కుమార్తె భవాని(14), మరో కూతురు అక్షయ(02), నారాయణ కుమారుడు సామ్యూల్(07), చాదర్‌ఘాట్‌కు చెందిన శివశంకర్(07), యాఖుత్‌పురాకు చెందిన ఆశీషా బేగం(45), అజీజా బేగం తదితరులు ఉన్నారు. ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
 
 గోపన్‌పల్లిలో శరవేగంగా వ్యాప్తి
 చిన్నారులకు సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయకపోవడమే గోపన్‌పల్లిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాతకు కారణమని వైద్యులు, స్థానికులు చెబుతున్నారు. స్థానిక రాజీవ్‌నగర్‌కాలనీలో చాలామంది చిన్నారులకు ఈ కాలనీలో శరవేగంగా డిఫ్తీరియా వ్యాధి వ్యాపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా మరో నలుగురికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. కాగా మరో అయిదుగురు జ్వరంతో బాదపడుతూ ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. డిఫ్తీరియా వ్యాధి లక్షణాలున్న శివమణి, భవాని, అఖిల , లక్కీలను చికిత్స నిమిత్తం మధ్యాహ్నం 108 అంబులెన్స్‌లో ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. కాగా జ్వరంతో తన్మయి, జయేష్‌మేరి, సంగీత, సంతోష్, అక్షయ బాదపడుతూ ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు.  
 
 బాధితులకు పరామర్శలు
 డిఫ్తీరియాతో బాధపడిన చిన్నారుల కుటుంబ సభ్యులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన ఆయన మంచి ఆహారం అందించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. విషయం తెలుసుకొన్న జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుభాష్ చంద్రబోష్ జీహెచ్‌ఎంసీ సర్కిల్-11 డాక్టర్ రవితో కలిసి బస్తీని పరిశీలించారు. నలుగురు చిన్నారులను నిలోఫర్‌కు తరలించారు. స్థానికంగా జ్వరంతో బాధపడుతున్న చిన్నారులకు ఎరిత్రోమైసిన్, ప్యారాసిటమల్ మందులను పంపిణీ చేశారు. ఫీవర్ ఆస్పత్రి నుంచి వచ్చిన డాక్టర్ బాలాజి ఆధ్వర్యంలోని నలుగురు నిపుణుల బృందం గోపన్‌పల్లిలో చిన్నారులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు బయటపడలేదని వారు తెలిపారు.శేరిలింగంపల్లి తహశీల్దార్ రాజేషం, వెస్ట్‌జోన్ జోనల్ కమిషనర్ అలీమ్‌భాష, సర్కిల్-11 డీసీ సురేష్‌రావు, జిల్లా మలేరియా అధికారి సంతోష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, డాక్టర్ లలిత, రవి బాధితులను పరామర్శించారు.
 
  జాగ్రత్తలివీ..  
 కేఎల్‌బీ టెస్టు ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు.
  తరవాత కల్చర్ టెస్టుతోవ్యాధి సోకినట్లు నిర్ధారిస్తారు.
 వ్యాధి నివారణకు పెన్సిలిన్ ఇంజక్షన్ వాడతారు.
 ప్రాథమిక దశలో గుర్తిస్తే ఇది తేలికగా నయమవుతుంది.
 వ్యాధిగ్రస్తులకు తక్షణం చికిత్స అందించాలి.
 పిజ్జా, బర్గర్, ఐస్‌క్రీములకు దూరంగా ఉండాలి.
 చిన్నారులకు వైద్యుల సూచనల మేరకు సకాలంలో డీపీటీ (డిప్తీరియా, ధనుర్వాతం, కోరింతదగ్గు) వ్యాక్సిన్ వేయించాలి.సరిగా నిల్వ చేయని వ్యాక్సిన్ తీసుకున్నా ఈ వ్యాధి సోకుతుంది.- డాక్టర్ శంకర్
 
 గోపన్‌పల్లిలో విషాద ఛాయలు
 డిప్తీరియా వ్యాధితో ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గోపన్‌పల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతి ఇంట్లో జ్వరంతో బాదపడుతున్న చిన్నారులే కనిపిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చిన్నారులిద్దరితో పాటు ప్రభు తాత కేశవ్ మృత దేహ లకు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న ఆ బస్తీలో వ్యాక్సిన్ అంటే తెలియని నిరుపేదలు ఎందరో ఉన్నారు. అసలు డిఫ్తిరియా వ్యాధి అంటేనే తమకు తెలియదని బస్తీవాసులు క న్నీరుమున్నీరవుతున్నారు. వ్యాధి రోజురోజుకూ ప్రబలుతుండటంతో తమ పిల్లలకు ఏమవుతుందోనని పలువురు చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాధి భయంతో మూడు కుటుంబాలు గోపన్‌పల్లి విడిచి సొంత ఊళ్లకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.
 
 అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నాం
 డిఫ్తీరియాకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్న వారంతా కోలుకుంటున్నారు. సోమవారం ఉదయం మృతి చెందిన వైశాలి, షారూఖ్‌ల ఆరోగ్యం విషమించిన తరువాత ఇక్కడికి తీసుకు వచ్చారు. దీంతో వైశాలి చనిపోయింది.     - డాక్టర్ కె.శంకర్, సూపరింటెండెంట్
 
 వైద్యశిబిరం కొనసాగిస్తాం
 గోపన్‌పల్లిలో ప్రస్తుతం వైద్య శిబిరం ఏర్పాటు చేసి, 150 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాం. డిఫ్తీరియా వ్యాధి అదుపులోకి వచ్చేంత వరకు ఈ శిబిరం కొనసాగిస్తాం.
 - బి.శ్రీధర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement