వైద్యులపై దాడులను సహించం
లక్ష్మారెడ్డి
గాంధీ ఆస్పత్రిలో సంఘటనలపై జూడాలతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: వైద్యులపై దాడులను ఏమాత్రం సహించబోమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. గాంధీ ఆస్పత్రిలో ఇటీవల వైద్యులపై కొందరు దుశ్చర్యలకు పాల్పడ్డారని నిరసిస్తూ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి బుధవారం జూడాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇకపై ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీసీ కెమెరాలు, పోలీసు రౌండ్లను పెంచడం, ఆస్పత్రి సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్యులపై ఎలాంటి దాడులకు పాల్పడ్డా చట్టపరంగా కఠిన చర్యలు, భారీ జరిమానాలు ఉంటాయన్నారు. సమావేశంలో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్, జూడా నాయకులు శ్రీనివాస్, కిరణ్, అభిలాష్ పాల్గొన్నారు.