కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు
ఏపీ స్పీకర్, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
- జనరల్ పర్పసెస్ సమావేశానికి పాలకపక్షం నుంచి 22 మందా? ప్రతిపక్షం నుంచి ముగ్గురేనా?
- ఇది ఏ పార్లమెంటరీ సంప్రదాయం?.. ఈ సమావేశం ఎజెండా ఏంటో కూడా చెప్పట్లేదు ఎందుకు?
- అసెంబ్లీ లాంజ్ నుంచి వైఎస్ చిత్రపటం తొలగింపు దుర్మార్గం..
- దాన్ని యథాస్థానంలో పెట్టాలని మేం పట్టుపడితే దానిని ఘర్షణగా చిత్రీకరించాలని చూస్తున్నారు
- అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్ని పక్కదోవ పట్టించడానికే ఈ సమావేశం
- తద్వారా తమ దుర్మార్గాలు, అవినీతిపై చర్చ జరక్కుండా చూసుకోవాలనుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘‘దిగజారుడు రాజకీయ వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చవద్దు. రాష్ట్రం లో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి, లేని సమస్యలను సృష్టించి.. దానికోసం ఏర్పాటు చేసిన జనరల్ పర్పసెస్ కమిటీని వెంటనే రద్దు చేయండి’’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ పరిపాలనలో జరుగుతున్న దుర్మార్గాలు, అవినీతిపై రాబోయే వర్షాకాల శాసనసభా సమావేశాల్లో చర్చ జరక్కుండా చేసేందుకు ఆ పార్టీ కుటిలయత్నాలు మొదలుపెట్టిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము 10న ఢిల్లీలో ధర్నా తలపెట్టిన నేపథ్యంలోనే ఈ కమిటీ సమావేశాన్ని 11న ఏర్పాటు చేశారని జగన్ మండిపడ్డారు. ‘కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్’ సమావేశానికి సంబంధించి శాసనసభ కార్యదర్శి పంపిన లేఖలపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఏపీ సీఎం చంద్రబాబుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. లేఖను పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. లేఖలోని వివరాలిలా ఉన్నాయి.
ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు?:‘కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్’ సమావేశాన్ని ఈ నెల 11న నిర్వహిస్తామని అసెంబ్లీ కార్యదర్శి పంపిన లేఖను చదివిన తరువాత తానీ ఉత్తరం రాస్తున్నట్టు జగన్ పేర్కొన్నారు. ‘‘అసలీ సమావేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు? సమావేశంలో నిర్దిష్ట ఎజెండా ఏమిటి?’ అని ప్రశ్నించారు. సమావేశంలో పాల్గొనేవారి జాబితాలో స్పీకర్‌తో కలిపి 25 పేర్లున్నాయని, అసెంబ్లీలో ప్రధానమైన, ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ నుంచి తనతో కలిపి కేవలం ముగ్గురు పేర్లే ఉన్నాయంటూ.. 25 మంది సభ్యులకుగాను ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గుర్ని, పాలకపక్షం నుంచి 22 మందిని పిలవటం ఏ పార్లమెంటరీ సంప్రదాయమో చెప్పగలరా? అసలు దీన్ని కమిటీ సమావేశం అంటారా?’’ అని ఆయన ప్రశ్నించారు.
హఠాత్తుగా ఎందుకు పుట్టుకొచ్చిందీ?
విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో తమ పార్టీ ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేపడుతున్న విషయాన్ని గత జూలై 30వ తేదీనే ప్రకటించామని జగన్ గుర్తుచేస్తూ.. ఈ విషయం తెలిసే జనరల్ పర్పసెస్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారని, మొదట 10వ తేదీ అని, తర్వాత 11న అని సమాచారం పంపించడం దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. గత పుష్కరకాలంలో ఇలాంటి సమావేశాలు జరిగిన దాఖలాల్లేవన్నారు. టీడీపీ అధికారం చేపట్టిన గత 15 నెలల కాలంలోనూ దీనిని ప్రస్తావించలేదని, అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు పుట్టుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కనీసం ఈ సమావేశం ఎజెండా ఏమిటో కూడా చెప్పట్లేదని, అంత రహస్యంగా.. రాజకీయ వ్యవహారంగా సాగుతోందని దుయ్యబట్టారు.
సభాసమావేశాలను పక్కదోవ పట్టించేందుకే...
ముఖ్యమంత్రిగా ఉండగా మరణించిన వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళిగా ఆనాటి స్పీకర్, ప్రభుత్వం సభా సంప్రదాయాల మేరకు ఆయన చిత్రపటాన్ని అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేస్తే కనీస మర్యాద పాటించకుండా టీడీపీ ఆ ఫొటోను తొలగించి వేయించిందని జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ఇది సరైన సంప్రదాయం కాదని మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకొస్తే గేట్లు మూసివేశారు. మా అభిప్రాయం వినడానికీ ఎవరూ సిద్ధంగా లేరు. వైఎస్ చిత్రపటాన్ని లాంజ్ నుంచి తొలగించడమే దుర్మార్గం.
అయితే చిత్రపటం తొలగింపును సమర్థించడానికి... తద్వారా అసెంబ్లీలో సమస్యలు పక్కదారి పట్టించి, దీన్ని ఒక ఘర్షణగా చిత్రీకరించేందుకు ఎత్తుగడ వేసి, అందులో భాగంగానే మీరు ఈ సమావేశాన్ని పెట్టారనే విషయం అర్థమవుతోంది’’ అని జగన్ నిప్పులు చెరిగారు. వైఎస్ చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాలని గట్టిగా పట్టుపడుతున్నాం కాబట్టి.. ఆ పని చేయకపోవడంద్వారా మొత్తంగా శాసనసభా సమావేశాల్నే పక్కదోవ పట్టించి తమ పరిపాలనలో దుర్మార్గాలు, అవినీతిపైన రాబోయే వర్షాకాల సమావేశాల్లో చర్చ జరక్కుండా చూసుకోవాలన్నదే టీడీపీ వ్యూహమని ఆయన విమర్శించారు.
జవాబు చెప్పలేకే దిగజారుడు రాజకీయాలు..
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం, డాక్యుమెంటరీ నిర్మాణంకోసం పుష్కరాల్లో 30 నిండు ప్రాణాలు బలిపెట్టడం, తీవ్ర కరువు కాటకాలతో రాష్ట్రంలోని రైతులు విలవిల్లాడుతున్న దయనీయ పరిస్థితులు, టీడీపీ నేతల ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు తహసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి, మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఆర్థికమంత్రి యనమల మనుషులతో దాడి, అనంతపురం జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన దోషులను సర్కారు వెనకేసుకొస్తున్న తీరు, రాష్ట్రానికి కీలకమైన ప్రత్యేక హోదా ఊసెత్తకుండా కేంద్రప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ వంటి అనేక అంశాలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలన్న వైఎస్సార్‌సీపీ ఎజెండాలోని అంశాలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో.. వాటినుంచి తప్పించుకోవడానికి, శాసనసభను పక్కదారి పట్టించడానికి వైఎస్ ఫొటోను తొలగించడం వంటి కుట్రపూరిత రెచ్చగొట్టే కార్యక్రమాలకు, దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లేని సమస్యను సృష్టించి.. అందుకోసం ఏర్పాటు చేసిన జనరల్ పర్పసెస్ కమిటీని వెంటనే రద్దు చేయడంతోపాటు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే వైఎస్ ఫొటోను యథాస్థానంలో ఏర్పాటు చేసి సభ గౌరవ ప్రతిష్టలను కాపాడాలని జగన్ బహిరంగ లేఖలో కోరారు.