నవవధువు అనుమానాస్పద మృతి
పంజగుట్టలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఘటన
పంజగుట్ట: వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఓ నవవధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనూష (27) చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) పూర్తి చేసింది. 2014 జూలై నుంచి బంజారాహిల్స్‌లోని ధర్మల్ పవర్ టెక్నో ఇండియా లిమిటెట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఫైనాన్షియర్‌గా పని చేస్తోంది. రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న సొనాలికా క్యాస్టేల్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది. ఈనెల 8వ తేదీని అనూషకు రాజమండ్రికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్‌తో పెళ్లైంది. దుస్తులు తెచ్చుకొనేందుకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముషీరాబాద్‌లో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లిన అనూష రాత్రి 10.30కి హాస్టల్‌కు తిరిగి వచ్చింది. భోజనం చేయమని ఆయా అడగ్గా... చేసి వచ్చానని చెప్పి, పాలు తాగి బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. ఉదయం ఆమె బెడ్‌పై శవమై కనిపించింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. నోటి నుంచి తెల్లటి నురుగు కారడం బట్టి విషం తాగి ఆత్మహత్య చేసుకుందా? లేక ఫుడ్‌ఫైయిజిన్ అయిందా? గుండెపోటు వచ్చిందా.. అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఆ గదిలో ఒక్కత్తే ఉంది...
అనూషతో పాటు హాస్టల్‌లో మొత్తం 8 మంది ఉంటున్నారు. అనూష ఉండే గదిలో హర్షిత అనే యువతి ఉంటోంది. ఆమె షిరిడీ వెళ్లడంతో అనూష ఒక్కత్తే ఆదివారం రాత్రి తన గదిలో పడుకుంది. సోమవారం ఉదయం నగరానికి తిరిగి చేరుకున్న హర్షిత సుమారు 7.20కి హాస్టల్‌లోని తమ గదికి వెళ్లగా అనుమానాస్పదస్థితిలో అనూష బెడ్‌పై పడి ఉంది. వెంటనే హాస్టల్ సిబ్బంది పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 108 సిబ్బందిని ర ప్పించారు. అనూషను పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే ఆమె మృతి చెందినట్టు నిర్థారించారు. పోలీసులు క్లూస్‌టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి ఆధారాల కోసం శోధించారు. పోలీస్ జాగిలం మృతదేహం వద్ద నుంచి డోర్ పక్కనే ఉన్న లిఫ్ట్ వద్దకు వచ్చి... తిరిగి కామన్ బాల్కనీలోకి వెళ్లింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనూష తల్లిదండ్రులు నేరుగా గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త అర్జున్ కూడా బెంగళూరు నుంచి నగరానికి బయలుదేరినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు.