మద్యం మత్తులో యువకుడి డ్రైవింగ్...
ఆటో, టూవీలర్‌ను ఢీకొట్టిన కారు
ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లో గురువారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ఆటో, ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరు చావుబతుకుల మధ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10నుంచి తప్పతాగిన మైకంలో ఓ యువకుడు ఆడికారు(ఏపీ 9సీటీ 0027) నడిపిస్తూ ముందు వెళ్తున్న ఆటోతోపాటు ద్విచక్ర వాహనం ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న పుష్పలతతో పాటు స్కూటీ నడిపిస్తున్న అంబిక తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో రోడ్డంతా రక్తసిక్తమైంది. ప్రమాదానికి కారకుడైన ఆడి కారు యజమాని పవన్ అక్కడి నుంచి తప్పించుకునే యత్నం చేయగా చుట్టుపక్కల వారు అడ్డుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు.
అప్పటికి చేసిన తప్పును ఒప్పుకోకుండా పవన్ పోలీసులపై జులుం ప్రదర్శించాడు. నిందితుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడి కుమారుడిగా పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదాన్ని నిరసిస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులకు స్థానికుల వాగ్వాదం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.