ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించాలి
మోహన్‌రెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు
హైదరాబాద్: ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసును సీబీఐకి అప్పగించి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి బాధితుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల సంఘం అధ్యక్షులు ముస్కు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పుల్యాల పెద్దిరెడ్డి, బాధితులు సోమ సురేశ్, ముజీబ్, సరోజ, భోగలక్ష్మి, కాంతాల స్వప్న మాట్లాడారు. సీఐడీ కార్యాలయంలో పనిచేస్తున్న మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ వ్యవహరంలో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారని ఆరోపించారు. మోహన్ రెడ్డి రుణం తీసుకునే వారికి వడ్డీకి వడ్డి విధించేవాడని అన్నారు. అప్పులిచ్చేవారు రుణగ్రహీతల నుంచి భూములు, ఇళ్లను తనఖా చేసుకుంటారని.. మోహన్‌రెడ్డి మాత్రం రుణం తీసుకున్న వారి ఆస్తుల్ని సేల్‌డీడ్ చేయించుకునే వాడని, కిస్తులు చెల్లించడం ఆలస్యమైతే సేల్‌డీడ్ ఆస్తులను మార్పిడి చేయించుకునేవాడని అన్నారు.
మోహన్‌రెడ్డి ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
దాదాపు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మోహన్ రెడ్డి బాధితులు డిమాండ్ చేశారు. మోహన్‌రెడ్డి బినామీలు, కుటుంబ సభ్యులను అరెస్టు చేసి వారి పేరిట ఉన్న వేలాది డాక్యుమెంట్లను బయటకు తీయాలని, ప్రభుత్వం ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బాధితుల భూముల్ని, ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేయాలని కోరారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు.