నీటి కరువుకు పరిష్కారం: కె.లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పం దంతో తెలంగాణలో నీటి కరువుకు పరిష్కారం లభిస్తుందని బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కేంద్రం, ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించలేదన్నారు. కానీ తమ నేతల కృషి వల్లే తాజా ఒప్పందం సాకారమైందన్నారు. ఈ ఒప్పం దంలో కేంద్ర మంత్రులు హన్స్‌రాజ్ అహిర్, బండారు దత్తాత్రేయ కీలకపాత్ర పోషించారన్నారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి నదుల అనుసంధానం కలను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేనందున ఈ ప్రాజెక్టులు జల రవాణాకు ఉపయోగపడేలా చూడాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను కోరినట్లు చెప్పారు. ఫడ్నవీస్‌ను కలసిన 13 మంది నేతల్లో ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ జాతీయ నేత వెదిరె శ్రీరాం, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎం.ఎస్.ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, పార్టీ నేతలు జి.ప్రేమేందర్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్ తదితరులున్నారు.