![యమ'డ్రింకరులు'! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/61475735290_625x300.jpg.webp?itok=21Ac536O)
యమ'డ్రింకరులు'!
హైదరాబాద్: యమ ‘డ్రింకరులు’ యమ కింకరుల్ని మించిపోతున్నారు... పగలు, రాత్రి, చిన్నా.. పెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో వాహనాలపై దూసుకుపోతున్నారు... మృత్యుశకటాలను నడిపేవారు సేఫ్‌గానే ఉంటున్నప్పటికీ ఎదుటి వారి బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు... మొన్న పంజగుట్ట పరిధిలో రమ్య కుటుంబం, నిన్న హయత్‌నగర్‌లో సంజన కుటుంబం, తాజాగా మంగళవారం అర్దరాత్రి సరూర్‌నగర్ లిమిట్స్‌లోని కర్మన్‌ఘాట్ వద్ద రత్నాకర్‌రెడ్డి మద్యం మత్తులో వాహనం నడుపుతూ వచ్చి యాదగిరిని ఢీకొట్టి క్షతగాత్రుడిని చేశాడు. వీరే కాదు... రికార్డుల్లోకి ఎక్కని, ఎక్కిన ‘నిషా’చరుల బాధితులు ఇంకా ఎందరో. ఈ మందుబాబుల్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి.
ఎస్‌ఓపీ లేక మరిన్ని ఇబ్బందులు...
ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. రమ్య ప్రమాదం విషయంలో ఆ రోజు వాహనంలో ఉన్న వారంతా మద్యం తాగినప్పటికీ... కేవలం ఆ స్థితిలో వాహనం నడిపిన వ్యక్తి మీద మాత్రమే కేసు నమోదు చేశారు. సంజన విషయానికి వచ్చేసరికి అతడితో పాటు ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. రమ్య కేసులో నిందితుడికి బెయిల్ రావడానికి మూడు నెలల పడితే... సంజన కేసులో 24 గంటల్లోనే వచ్చింది.
కఠిన చర్యలు లేకపోవడమూ...
మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిషా’చరులు పెరగడానికి ఓ కారణమవుతోంది. ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్‌లను ట్రాఫిక్ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆపై కోర్టులో హాజరుకావల్సిందిగా ఆదేశిస్తున్నారు. అయితే అనేక ఉదంతాల్లో మందుబాబులు న్యాయస్థానాలకు వెళ్లకుండా తన వాహనాలను వదిలేస్తున్నారు. తక్కువ ఖరీదైన వాహనాల విషయంలోనే ఇలా జరుగుతోంది. ‘నిషా’చరులకు జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం, వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, వారితో పాటు కుటుంబీకులకూ పక్కాగా కౌన్సెలింగ్ చేయడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.
అది మూడో కేటగిరీ వైలేషన్...
ట్రాఫిక్ ఉల్లంఘనలను వాటి తీవ్రతను బట్టి అధికారులు వాటిని మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరమైనవి, రెండోది ఎదుటి వారికి ప్రమాదకరమైనవి. ఈ రెంటినీ మించి తీవ్రమైన వాటిని మూడో కేటగిరీలోకి చేరుస్తారు. ఈ ఉల్లంఘనల వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం పొంచి ఉంటుంది. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే.., డ్రంకన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ తదితరాలు మూడో కేటగిరీలోకి వస్తాయి.
నిరూపించడమూ పెద్ద సవాలే...
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం జరుగుతోంది. మళ్లీ వీరు చిక్కేప్పటికీ 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, ఆ స్థితిలో డ్రైవింగ్ చేశాడని నిరూపించడం కష్టమవుతోంది. ఒకవేళ వారు యాక్సిడెంట్ చేసిన వెంటనే చిక్కినా... మూడు కమిషనరేట్లలోనూ అవసరమైన స్థాయిలో శ్వాస పరీక్ష యంత్రాలు లేవు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో కొంత వరకు అందుబాటులో ఉన్నా... శాంతిభద్రతల విభాగం దగ్గర దాదాపు లేనట్లే. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లేది, ఆ కేసుల్ని దర్యాప్తు చేసేదీ శాంతిభద్రతల విభాగం పోలీసులే కావడం గమనార్హం.
మద్యం మత్తులో ‘చిత్తు’ లెన్నో,..
మద్యం తాగడం కొందరికి సరదా అయితే మరెందరికో వ్యసనం. తమ ఆనందం కోసం మత్తులో జోగుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా... జనం జీవితాల్నీ చిత్తు చేస్తున్నారు.
♦ లాల్‌దర్వాజకు చెందిన సాయికిరణ్ తన తల్లి అనూరాధతో కలిసి బైక్‌పై బంధువులు ఇంటికి వస్తున్నారు. పోచమ్మ ఆలయం దాటాక అడ్రస్ కనుక్కోవడం కోసం ఆగారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో అనూరాధ అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సనత్‌నగర్ పోలీసులు నిర్థారించారు.
♦ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది రంజిత్ మద్యం తాగి తన బొలేరో వాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చారు. వాహనంపై అదుపు కోల్పోవంతో బేగంపేట ఫ్లైఓవర్‌పై దిమ్మెను తాకుతూ అతి వేగంగా వచ్చి బైక్‌పై వస్తున్న రసూల్‌పురకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీకాంత్ తదితరుల్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడిక్కడే చనిపోయారు.
♦మద్యం మత్తులో ఓ వాహనచోదకుడి నిర్లక్ష్యం 18 రోజుల కాలంలో మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బంజారాహిల్స్‌లోని పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన ‘రమ్య ఉదంతం’లో రమ్యతో పాటు ఆమె బాబాయి పమ్మి రాజేష్, తాత మధుసూదనాచారి ప్రాణాలు తీయగా... తల్లి రాధికకు తీవ్రగాయాలు చేసింది.
♦ మూడు రోజుల క్రితం నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేటలో జరిగిన ‘మద్యం’ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజన మృత్యువుతో పోరాడుతోంది. ఆమె తల్లి శ్రీదేవి సైతం తీవ్రంగా గాయపడ్డారు.