
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త.
ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం పోస్టుల సంఖ్యపై స్పష్టత: కడియం
జూన్ 2వ వారంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష
జూలై రెండో వారం నాటికి నియామకాలు
18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం
మార్చి 1న టెట్ నోటిఫికేషన్.. ఏప్రిల్ 9న పరీక్ష!
టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు
పలు జిల్లాల్లో కొత్త పోస్టుల సృష్టి
విద్యాశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏప్రిల్ చివరి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై రెండో వారంలోగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ సహా సంక్షేమశాఖల పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 18 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఆర్థిక శాఖ ఆమోదం తరువాతే పోస్టుల వివరాలను వెల్లడించనుంది. ఈ మేరకు డీఎస్సీ, టెట్‌లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
సోమవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ముందుగానే టెట్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) డీఎస్సీ కంటే ముందే నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించారు. టెట్‌లో అర్హత సాధించిన వారినే డీఎస్సీ రాసేందుకు అనుమతిస్తారు. టెట్ నిర్వహణకు మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఏప్రిల్ రెండో వారంలో టెట్ నిర్వహించి, అదే నెల మూడో వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను కడియం శ్రీహరి ఆదేశించారు. ఈ లెక్కన టెట్ నోటిఫికేషన్‌ను మార్చి 1న జారీ చేసి... పరీక్షను ఏప్రిల్ 9న (రెండో శనివారం) లేదా 10న (ఆదివారం) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, ఓఎంఆర్ జవాబు పత్రాన్ని వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక డీఎస్సీ పరీక్షను జూన్ రెండో శనివారం (11వ తేదీన) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ రాయవచ్చు. ‘టెట్’కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది కనుక ఈ అవకాశం కల్పిస్తారు. అయితే వారు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే నాటికి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తిచేసి, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. మొత్తంగా నోటిఫికేషన్లు జారీ చేసిన నాటి నుంచి టెట్ ప్రక్రియను 60 రోజుల్లో, డీఎస్సీ ప్రక్రియను 75 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తరువాత వెల్లడిస్తామని కడియం చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలను పూర్తి చేస్తామన్నారు. మరోవైపు అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించాలని ఇది వరకే ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
కొత్త పోస్టుల సృష్టి..!
వివిధ జిల్లాల్లో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా ఉంది. సబ్జెక్టు టీచర్లు లేక బోధన దెబ్బతింటోంది. దీంతో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల అవసరం ఉంది. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండటమే కాకుండా కొన్ని అదనపు పోస్టులు అవసరం. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులను సృష్టించాలని నిర్ణయించారు. దీనికోసం ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులు అవసరమన్న ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ ఆమోదం తరువాతే కొత్త పోస్టులు ఎన్ని వస్తాయన్నది తేలనుంది. విద్యాశాఖ మాత్రం వివిధ కేటగిరీల్లో నాలుగైదు వేల వరకు అదనపు పోస్టులు అవసరమని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 10,961 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు వచ్చే అదనపు పోస్టులు, వివిధ మేనేజ్‌మెంట్ల పరిధిలోని స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపితే 18 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశముంది.
ప్రభుత్వ/జెడ్పీ స్కూళ్లలో ఖాళీలివీ..
జిల్లా ఖాళీలు
మహబూబ్‌నగర్ 2,024
ఆదిలాబాద్ 1,818
రంగారెడ్డి 1,442
మెదక్ 1,257
నిజామాబాద్ 944
హైదరాబాద్ 763
ఖమ్మం 724
నల్లగొండ 689
కరీంనగర్ 666
వరంగల్ 634
మొత్తం 10,961
నష్టపోయిన వారిపై విధానపర నిర్ణయం: కడియం
వివిధ డీఎస్సీలకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ఎంత మంది నష్టపోయారు, వారికి ఎలా న్యాయం చేయవచ్చు, న్యాయపరమైన సమస్యలేమైనా ఉన్నాయా? అన్న అంశాలపై పరిశీలన జరిపామన్నారు. వారికి న్యాయం చేసే అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.