డూప్లికేట్ నెంబర్లతో జాగ్రత్త...
బైకులు, ఆటోలకూ డబుల్ రిజిస్ట్రేషన్
తమ బండికి వేరే వారి వాహనం నంబర్ పెట్టుకొని షికార్లు
ట్రాఫిక్ చలాన్లు, ఆర్టీఏ పన్ను ఎగ్గొట్టేందుకే..
చేయని తప్పుకు అసలు వాహనదారుడికి చలాన్
చార్మినార్:ఆర్టీఏ పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో రెండు బస్సులు, లారీలు, టిప్పర్ వంటి భారీ వాహనాలను తిప్పుతూ పట్టుబడిన వైనం ఇప్పటి వరకు మనకు తెలుసు. అయితే, ఈ సంస్కృతి ఇప్పుడు ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వంటివాటికి కూడా సోకింది. ఆర్టీఏ పన్నుతో పాటు ట్రాఫిక్ చలాన్ల బారి నుంచి తప్పించుకొనేందుకు కొందరు వాహన యజమానులు తమ వాహనాలకు వేరే వారి బండి నెంబర్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇలా దొంగ నెంబర్ పెట్టుకొని వెళ్తున్న వారు ఎక్కడైన ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ నెంబర్ గల అసలు వాహనదారుడి ఇంటికి చలాన్ వెళ్తోంది. తాను చేయని తప్పుకు చలాన్ రావడంతో కంగుతింటున్న అతను ట్రాఫిక్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి చూస్తే... ఈ నంబర్‌తో మరో వాహనం కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనంతో పాటు దాన్ని నడిపిన వ్యక్తి ఫొటో వెబ్‌సైట్‌లో కనిపించడంతో ఒరిజినల్ వాహనదారుడు నివ్వెరపోతున్నాడు.
ఏపీ 11 ఏఎఫ్ 9212తో రెండు వాహనాలు...
మలక్‌పేట్ ఆనంద్‌నగర్ నివాసి సోమారపు యోగానంద్ 13-07-2009లో హీరో హోండా స్ల్పెండర్‌ను తన పేరుతో ఈస్ట్ జోన్ ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే ఇదే నంబర్‌తో యాక్టివా వాహనంపై గతనెల 24న పాతబస్తీ నయాపూల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తూ ముందుకు వెళ్లాడు. దీంతో చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు ఒరిజినల్ నెంబర్ యజమానికి రూ.100 చలాన్‌ను విధించారు. గత నెలలో తాను నయాపూల్ వైపు వెళ్లలేదని.. చలాన్ ఎలా వచ్చిందో తెలుసుకొనేందుకు యోగానంద్ ట్రాఫిక్ పోలీసుల వెబ్‌సైట్‌లో చూడగా.. తన బైక్ నెంబర్‌తో యాక్టివా వాహనం, దానిని నడుపుతున్న వ్యక్తి కనిపించాడు. దీంతో ఈస్ట్ జోన్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఆయన చాదర్‌ఘట్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు చేశాడు.
పొంచి ఉన్న ప్రమాదం...
ఉద్దేశపూర్వకంగా వేరే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను తమ వాహనాలకు తగిలించుకొని తిరిగే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బాధిత వాహనదారుడు సోమారపు యోగానంద్ కోరారు. తన వాహనం నంబర్‌తో మరో వాహనం ఉన్నట్లు తేలడంతో తాను షాక్‌కు గురయ్యానన్నారు. డూప్లికేట్ నంబర్లతో ఒరిజినల్ వాహనదారులకు ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.