ఎడ్‌సెట్‌లో అర్హులు 97.74 %
- మొత్తంగా అర్హత సాధించిన 57,413 మంది విద్యార్థులు
- వచ్చే నెలలో కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 16న నిర్వహించిన ఎడ్‌సెట్–2017లో 97.74 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎడ్‌సెట్ కోసం 64,029 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా వారిలో 58,738 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 57,413 మంది (97.74 శాతం) అర్హత సాధించారు. అర్హుల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను వచ్చే నెలలో చేపట్టనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు.
జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కూడా కాలేజీల సమగ్ర వివరాలతో కూడిన అఫిడవిట్లు దాఖలు చేసేందుకు కాలేజీ యాజమాన్యా లకు ఈ నెల 31 వరకు గడువు ఇచ్చిందని వెల్లడించారు. దీంతో ఈ నెలాఖరు తరు వాత ఎన్ని కాలేజీలకు ఎన్‌సీటీఈ గుర్తింపు రద్దు చేసిందో, ఎన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలన్న విషయంలో స్పష్టత వస్తుందని, ఆ తరువాత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వివరించారు. గతేడాది 184 కాలేజీల్లో 18,400 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఐదు సబ్జెక్టుల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకర్లు వీరే..
గణితం : వేముల మాధురి,కూనారపు రమేశ్
ఫిజికల్ సైన్స్ : గన్నెర్ల సైదాచారి,తాళ్ల అభినయ శరాన్
బయోలాజికల్ సైన్స్: వంశీ సాలిగంటి, మానస దీప్తి ముప్పాళ్ల
సోషల్ స్టడీస్ : హనుమాండ్ల లక్ష్మీ వర ప్రసాద్, సాహిక్ లతీఫ్
ఇంగ్లిష్ : తస్నీమ్ సుల్తానా,నిఖత్ పర్వీన్