ఎలక్ట్రిక్ షాక్!
జనంపై భారం 3,359 కోట్లు
టీడీపీ హయాంలో మూడోసారి కరెంట్ చార్జీల వాత
విద్యుత్ చార్జీల బాదుడుకు టీడీపీ సర్కారు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాన్యుడికి షాక్ ఇచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఏకంగా రూ. 3,359 కోట్లు ప్రజల నడ్డి విరిచి పిండు కోవాలని నిర్ణయించింది. ప్రత్యక్ష, పరోక్ష పద్ధతుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి వినియోగ దారులపై పెనుభారం మోపబోతోంది. ప్రత్యక్షంగా రూ.859 కోట్లు, దొడ్డిదారిన మరో రూ.2,500 కోట్లు రాబట్టేందుకు వ్యూహం సిద్ధమైంది. గృహ వినియోగదారుల నుంచి పారిశ్రామికవేత్తల వరకూ... షాక్ తగిలేలా చేసిన ప్రతిపాదనలను ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు బుధవారం ఏపీఈఆర్‌సీ ముందుంచాయి.కమిషన్ అనుమతిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడం ఇది మూడోసారి . తొలి ఏడాది (2015–16) రూ. 940, రెండో ఏడాది (2016–17) రూ. 242 కోట్లు పెంచింది. ఆ తరహాలోనే ఈసారి ప్రజలపై దొంగదెబ్బ తీసే మార్గాన్నే ఎంచుకుంది. గత ఏడాది శ్లాబుల వర్గీకరణలో మార్పు చేసి వినియోగదారులపై భారం మోపారు. ఈసారి పంథాను మార్చారు.వంద యూనిట్ల వినియోగం ఉన్న వారిపై చార్జీలు వేయలేదని డిస్కమ్‌లు చెప్పినా... గృహ వినియోగదారుల పై వారికి తెలియకుండానే ఫిక్స్‌డ్ చార్జీల భారాన్ని మోపారు. మరోవైపు పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులై డిమాండ్ చార్జీలను రెండింతలు చేశారు. దీని వల్ల రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది వినియో గదారుల్లో ప్రతీ ఒక్కరికీ విద్యుత్ షాక్ తగులు తుంది. దాదాపు 67 శాతం ఉన్న గృహ వినియోగదారులపై ఫిక్స్‌డ్ ఛార్జీలు వేయ డంవల్ల అదనపు భారం పడనుంది. ఇంట్లో ఇస్త్రీ పెట్టె, వాషింగ్ మిషన్, కూలర్ వంటి కనీస విద్యుత్ ఉపకరణాలున్నా విద్యుత్ బిల్లు రెట్టింపు అవ్వడం ఖాయం.
దొంగదెబ్బ ఇలా!
► రాష్ట్రంలో 1.59 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరిలో 89.62 లక్షల మంది గృహ వినియోగదారులు న్నారు. వీరందరికీ ఒక్క శాతం విద్యుత్ చార్జీలు పెరుగుతాయి. దీంతో పాటు పెరిగిన ఫిక్స్‌డ్,డిమాండ్ చార్జీల ద్వారా రూ.859కోట్ల ఆదాయం వస్తుంది.
► గృహ వినియోగదారులకు ఇప్పటివరకూ ఫిక్స్‌డ్ చార్జీలు లేవు. ఇక నుంచి కిలోవాట్ దాటిన వారికి రూ. 50 (ప్రతీ కిలోవాట్‌కు) ఫిక్స్‌డ్ చార్జీ వేస్తారు. అంటే.. వెయ్యి వాట్స్ లోడ్ దాటితే వాత తప్పదు. అంటే ఇంట్లో కూలర్‌వాడినా పరిమితి దాటుతుంది. కాబట్టి ప్రతీ గృహ వినియోగదారుడిపైనా రూ. 50 నుంచి రూ. 200 (లోడ్‌ను బట్టి) ఫిక్స్‌డ్ చార్జీలు పడనుంది.
► వాణిజ్య వినియోగదా రుల నుంచి రూ. 96 కోట్లు ప్రత్యక్షంగా రాబట్టాలని లక్ష్యం. ఈ కేటగిరీకి యూనిట్‌కు 50పైసలు తగ్గిస్తున్నట్టు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. కానీ కొత్తగా డిమాండ్ చార్జీలను రూ. 200 చేశారు. దీన్నిబట్టి షాపులో ఒక ఏసీ ఉన్నా ప్రతీ నెలా బిల్లు మోగిపోతుంది. దాదాపు 11.78 లక్షల మంది వాణిజ్య విద్యుత్ వినియోగదారులపై మూడింతలు పడే వీలుంది.
► ఎల్‌టీ పరిశ్రమలు (జనరల్) పరిశ్రమల వినియోగదారులు (రైసు మిల్లులు, చిన్నతరహా పరిశ్రమలు) రాష్ట్రంలో 1.06 లక్షల మంది ఉంటారు. వీరికి ప్రతీ యూని ట్‌కు 85 పైసలు తగ్గించారు. కానీ ప్రతీ కేవీకి రూ. 200 చొప్పున డిమాండ్ చార్జీగా వసూలు చేస్తారు. ప్రతీ పరిశ్రమ 56 కేవీ మొదలుకొని వెయ్యి కేవీ వరకూ ఉంటాయి. అంటే ప్రతి వినియోగదారుడిపైనా కనీసం రూ.11,200 పడుతుంది. వెయ్యి కేవీల వినియోగదారుడైతే అది రూ.రెండు లక్షలకు చేరుతుంది.
► సాధారణ పరిశ్ర మలు (భారీ, మధ్య తరహా) పరిశ్రమలకు యూనిట్‌కు రూ.1.25 విద్యుత్ చార్జీ తగ్గించి... కేటాయించిన లోడ్ దాటితే డిమాండ్ ఛార్జీని రూ.385 నుంచి రూ.1000కు పెంచారు. ఇలామూడు రెట్లు భారం పడే వీలుంది. అంటే ప్రతీనెలా సుమారు రూ. 25 వేలకుపైగా భారం ఖాయం. ఫలితంగా 5,409 మంది వినియోగదారులపై భారీగా విద్యుత్ భారం పడుతుంది.
► థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ వంటి (వాణిజ్య హెచ్‌టీ) వినియోగదారులకు ప్రస్తుతం రూ. 9.29 చొప్పున (యూనిట్‌కు) విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రతీ యూనిట్‌కు రూ.1.80 తగ్గించారు. కానీ, డిమాండ్ చార్జీని రూ.385 నుంచి రూ. వెయ్యికి పెంచారు.
సామాన్యుడి నడ్డి విరిగేది ఇలా..!
రంగయ్య అనే వ్యక్తి 20 ఏళ్ళ క్రితం విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడనుకుందాం. అప్పుడు అతని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉండేది. విద్యుత్ లెక్కల ప్రకారం ఒక బల్బు 25వాట్స్, సీలింగ్ ఫ్యాన్ 40 వాట్స్. మొత్తం 90 వాట్స్.ఇప్పుడు ఇంట్లో మరో 4 బల్బులు, 2 ఫ్యాన్లు పెరిగాయి. కూలర్, మిక్సీ అదనం. దీంతో అతని విద్యుత్ లోడ్ 1500 వాట్స్ దాటింది. అంటే 1 కేవీ దాటినట్టే కాబట్టి అతను ఫిక్స్‌డ్ ఛార్జీల పరిధిలోకి వస్తాడు. అంటే... నెలకు ఇప్పటివరకూ 100 యూనిట్లకు (ప్రతీ యూనిట్‌కు 2.60 చొప్పున) రూ. 260 బిల్లు కడుతున్నాడు. ఇప్పుడు 1.5 కేవీకి అదనంగా రూ. 75 ప్రతీ నెలా చెల్లించాలి. ఇక ఏసీ ఉంటే (1500 వాట్స్) మరో రూ.75 అదనంగా చెల్లించాలి. రంగయ్యే కాదు... ప్రతీ వినియోగదారునిదీ ఇదే పరిస్థితి. అదనంగా రూ.75 మొదలు కొని, రూ. 1500 వరకూ చెల్లించాల్సిందే.