మొయినాబాద్, న్యూస్‌లైన్: ఇంజినీరింగ్ విద్యార్థిపై అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్‌కుమార్(20) మండలంలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మండల పరిధిలోని బాకారం గ్రామానికి చెందిన జయరాంరెడ్డి(22) అదే కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అరుణ్‌కుమార్ తల్లి మొయినాబాద్‌లోని ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం అరుణ్‌కుమార్ మొయినాబాద్ బస్టాపులో తన తల్లికోసం వేచి చూస్తున్నాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన జయరాంరెడ్డి అతణ్ని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
స్థానికులు కలుగజేసుకుని ఇద్దర్ని అక్కడినుంచి పంపించేశారు. ఆ తరువాత రాత్రి 10 గంటల సమయంలో అరుణ్‌కుమార్‌కు జయరాంరెడ్డి ఫోన్‌చేసి గొడవ విషయం మాట్లాడుకుని రాజీ అవుదామని మొయినాబాద్‌కు పిలిపించాడు. జయరాంరెడ్డి తన స్నేహితులు రాంరెడ్డి, మాణిక్‌రెడ్డి, సాయి, వినాయక్‌రెడ్డి, ఓంరెడ్డితో కలిసి హోటల్ పక్కన ఉన్న గల్లీలోకి అరుణ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. అక్కడ ఒక్కసారిగా అరుణ్‌కుమార్‌ని జయరాంరెడ్డి కత్తితో కడుపులో పొడిచాడు. మరోసారి పొడిచేందుకు యత్నించగా అది అరుణ్‌కుమార్ ఎడమచేతికి తగిలింది. అనంతరం వారంతా అక్కడినుంచి పరారవగా అరుణ్‌కుమార్ మొయినాబాద్‌లో ఉండే తన స్నేహితుడు సురేష్ ఇంటికి వెళ్లాడు. వెంటనే సురేష్ ‘108’కు, పోలీసులకు సమచారం అందించి స్థానికుల సహాయంతో బాధితుణ్ని షాదన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ర్యాలీ...
బీటెక్ విద్యార్థి అరుణ్‌కుమార్‌పై దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మొయినాబాద్‌లో ఉన్న అరుణ్‌కుమార్ స్నేహితులు, స్థానికులు కలిసి మండల కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీఐ రవిచంద్రను కోరారు. పాతకక్షల నేపథ్యంలోనే విద్యార్థిపై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మిగిలినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. జయరాంరెడ్డిని కళాశాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
ఇంజినీరింగ్ విద్యార్థికి కత్తిపోట్లు
Published Tue, Mar 11 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement
Advertisement