
కో-డైరెక్టర్ పై డిజైనర్ మంగారెడ్డి దాడి!
హైదరాబాద్ : సెన్సార్ బోర్డు సభ్యురాలు, ఫ్యాషన్ డిజైనర్ మంగారెడ్డి... కో డైరెక్టర్ శరత్ కుమార్పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపుతోంది. తన సన్నిహితుడు కిషన్‌తో కలిసి ఆమె శుక్రవారం శరత్ను ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దాడి ఘటనపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాను ఆత్మరక్షణ కోసమే దాడి చేశానని మంగారెడ్డి చెబుతోంది.. శరత్ ఫోన్‌లో అసభ్యకరసందేశాలు పంపిస్తూ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై నిలదీసేందుకు శరత్ వెళ్లానని అయితే అతను తనపై దాడికి దిగాడని దీంతో ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేసినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా మంగారెడ్డి మాట్లాడుతూ 'ఆడవాళ్లంటే శరత్కు గౌరవం లేదు. అమ్మాయిలు ఛండాలంగా డ్రస్ చేసుకుంటారని రోజూ నాకు ఎస్ఎంఎస్లు పంపేవాడు. తనతో మాట్లాడవద్దని, చెప్పినా... శరత్ మెసేజ్లు పంపిస్తున్నాడు. అతడి ప్రవర్తనకు విసిగిపోయా. నిలదీసేందుకు శరత్ వెళ్లాను. అయితే అతడు నన్ను కొట్టడానికి మీదకు వచ్చాడు. నా డ్రస్ లాగి అసభ్యకరంగా మాట్లాడాడు. అలా మాట్లాడవద్దని నేను కూడా అరిచాను. నన్ను కొట్టడానికి రాబోతే ఆత్మరక్షణ కోసం అతడిని తోశాను.
దాంతో శరత్ తల కూలర్కు తగిలింది. రాడ్తో దాడి చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు అలా కొట్టడాలు ఏమీ లేవు. ఎవరూ కొట్టలేదు. కొట్టుకోలేదు. శరత్ ఫుల్గా తాగి ఉన్నాడు. అతడికి ఆల్కహాల్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పటివరకూ నేను శరత్ మీద ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఇప్పుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాను. 'హీ ఈజ్ నాట్ మై ఎనిమీ' నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అంతకన్నా మాట్లాడటానికి ఏమీ లేదు' అని తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.