హైదరాబాద్: చేసిన అప్పులు తీరడం లేదు... వాటికి వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి. అప్పలు తీర్చాలని ఒత్తిడి రోజురోజూకు అధికమవుతుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా అప్పులు ఏలా తీరుస్తామనుకున్నట్లు ఉన్నారు. దాంతో మరణమే శరణ్యమని ఆ కుటుంబం భావించింది. అంతే ఆ కుటుంబంలోని భార్యాభర్తతోపాటు కుమారుడు విషం తాగి మరణించారు.
ఆ ఘటన నగర శివారుల్లోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు ఆ విషయాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నాగార్జున నగర్ కాలనీలోని మృతుల ఇంటికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.