సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయనుంది. రెండు మూడు రోజుల్లో రూ.300 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. మరో రూ.300 కోట్లు ఈ నెలాఖరుకల్లా, మిగిలిన బకాయిలు డిసెంబర్ నాటికి విడుదల చేసేలా చర్యలు చేపడతామని తెలిపింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం నేతలు రమణారెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సతీశ్ తదితరులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీలను కొనసాగించలేని పరిస్థితి ఉందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల సహాయ నిరాకరణకు దిగామని ఈ సందర్భంగా వారు కడియంకు చెప్పారు. ఫీజు బకాయిలు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కడియం శ్రీహరి వెంటనే సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోనూ మాట్లాడారు. ఫీజు బకాయిల విడుదలకు సీఎం ఓకే చెప్పినట్లు తెలిసింది. విడతల వారీగా ఫీజుల విడుదలకు చర్యలు చేపడతామని యాజమాన్యాల సంఘానికి కడియం హామీ ఇచ్చారు. దీంతో తాము చేపట్టిన సహాయ నిరాకరణను నిలుపుదల చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి వెల్లడించారు.
రేపటి నుంచి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: ఓయూ పరిధిలో బుధవారం(19) నుంచి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. సోమవారం ప్రైవేటు కళాశాలల యజమానులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమవడంతో ముందు నిర్ణయించిన టైంటేబుల్ ప్రకారం పరీక్షలను ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ఫీజు బకాయిల విడుదలకు ఓకే
Published Tue, Oct 18 2016 3:52 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Advertisement