హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు రేగాయి. అయితే అప్పటికే తెల్లవారడం, మెలకువ వచ్చిన ప్రయాణికులు పొగ వాసనకు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వినాయక్ ట్రావెల్స్ బస్సులో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. బస్సు వనస్థలిపురం దాటగానే ఒక్కసారిగా పొగ వాసన రావడంతో ప్రయాణికులు ఆప్రమత్తమై బస్సును ఆపించి అంతా తమ సామాన్లతో సహా కిందకు దిగిపోయారు. ముందుగా దిగివారు చూసేసరికి అప్పటికే బస్సు కింద భాగంలో మంటలు మొదలయ్యాయి. దాంతో వాళ్లు లోపల ఉన్నవారిని కూడా అప్రమత్తం చేసి అందరినీ కిందకు దించేశారు.
మంటల మీద దగ్గర అందుబాటులో ఉన్న నీళ్లు చల్లారు. అయినా పొగలు మాత్రం చాలాసేపటి వరకు ఆగలేదు. బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీ అద్దాలు తెరుచుకుని ఉన్న ప్రయాణికులు వాసనను గుర్తించి సకాలంలో అప్రమత్తం కావడంతో చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. అదే ఏసీ బస్సు అయి ఉంటే అద్దాలు అన్నీ మూసేసి ఉండేవని, పొగ వాసన కూడా తమకు తెలిసేది కాదని ప్రయాణికులలో ఉన్న నవీన్ అనే యువకుడు 'సాక్షి'కి చెప్పారు. బహుశా ఇంధన ట్యాంకు లీకేజి వల్ల మంటలు వచ్చి ఉండొచ్చని ఆయన అన్నారు. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడిన ప్రయాణికులు.. కూకట్ పల్లి, లింగంపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అక్కడినుంచి సిటీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు.