తేల్చేద్దాం | Focus on the actions to resolve the problem kandlakoya | Sakshi
Sakshi News home page

తేల్చేద్దాం

Published Mon, Aug 31 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 8:25 AM

తేల్చేద్దాం

తేల్చేద్దాం

కండ్లకోయ సమస్యపై దృష్టి  పరిష్కారం దిశగా చర్యలు
రంగంలోకి అటార్నీ జనరల్  తుది తీర్పు కోసం హెచ్‌ఎండీఏ నిరీక్షణ

 
 సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డులోని పటాన్‌చెరు-శామీర్‌పేట మధ్య కండ్లకోయ జంక్షన్  వివాదం పరిష్కారానికి హెచ్‌ఎండీఏ ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు... గడచిన రెండు నెలలుగా సుప్రీం కోర్టులో తరచూ వాయిదా పడుతోంది. దీన్ని గుర్తించిన హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా తమ వాదనలు గట్టిగా వినిపించేందుకు అటార్నీ జనరల్‌ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆమె ప్రభుత్వానికి లేఖ రాశారు. ఔటర్ మొత్తం పూర్తి కావస్తున్నా... కోర్టు కేసుతో కండ్లకోయ జంక్షన్ నిర్మాణం ఆగిపోయిన విషయాన్ని... దీనికి ఆర్థిక సాయం అందిస్తున్న ‘జైకా’ నిర్దేశించిన గడువు దగ్గరపడుతున్న అంశాన్ని అందులో వివరించారు. కండ్లకోయ భూ వివాదంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో 2 ఎస్‌ఎల్‌పీలు ఉన్న విషయం తెలిసిందే. వీటిలో హెచ్‌ఎండీఏ నుంచి దాఖలైన పిటిషన్‌పై సీనియర్ అడ్వొకేట్ హరీష్‌సాల్వే వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన మరో పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు అటార్నీ జనరల్‌ను రంగంలోకి దించాలని హెచ్‌ఎండీఏ కోరుతోంది.

ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని హెచ్‌ఎండీఏను గట్టెక్కించాలని ప్రభుత్వ పెద్దలకు కమిషనర్ విన్నవించారు. నిజానికి ఔటర్ నిర్మాణానికి రుణాన్ని తీసుకునేందుకు ‘జైకా’ నిర్దేశించిన గడువు (లాస్ట్ డేట్ ఆఫ్ డిస్పర్స్‌మెంట్) 2016 మార్చితో ముగియనుంది. ఈలోగా కండ్లకోయ కేసు పరిష్కారం కాకపోతే ఆ తర్వాత జంక్షన్ నిర్మాణానికయ్యే రూ.150- 200 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఇది మరింత భారమయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో ఎలాగైనా వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.

ప్రత్యామ్నాయమే దిక్కు
అధికారులు ఉద్దేశపూర్వకంగానే అలైన్‌మెంట్ మార్చివేసి తమకు నష్టం కలిగించారంటూ కండ్లకోయ వద్ద 50 ఎకరాలకు సంబంధించి వాటి యజమానులు కిర్లోస్కర్, మరో 9 మంది ఇప్పటికే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ  కేసు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. దీంతో కండ్లకోయ జంక్షన్‌లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం పటాన్‌చెరు-శామీర్‌పేట మార్గం 35 కి.మీ. అందుబాటులోకి వచ్చినా... కండ్లకోయ జంక్షన్‌లో నిర్మాణం చేపట్టని కారణంగా సుమారు 3.5 కి.మీ. దూరం ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలు వెళ్లాల్సి వస్తోంది. నేరుగా లింకు లేకపోవడంతో ఔటర్ పూర్తయినా ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితి ఎదురైంది. ఇంకా ఆలస్యం చేస్తే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
 
ఆర్థిక భారం
 కండ్లకోయ జంక్షన్ భూ వివాదం తేలని కారణంగా హెచ్‌ఎండీఏకు ఆర్థిక భారం పెరగనుంది. జైకా ఫేజ్-1లో భాగంగా చేపట్టిన ఈ రీచ్ నిర్మాణానికి అగ్రిమెంట్ వ్యవధి (2012) ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ పనులు చేపడితే నిబంధనల ప్రకారం ఎస్కలేషన్  30-35 శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ టెండర్లు పిలవాలనుకొంటే కొత్త రేట్ల ప్రకారం అంచనాలు రూపొందించాలి. ఎస్కలేషన్ ఇచ్చి పాత కాంట్రాక్టర్‌తో పనిచేయించినా... లేదా కొత్తగా టెండర్లు పిలిచినా నిర్మాణ వ్యయం రెండింతలు పెరగడం ఖాయం. మొదట్లో ఈ నిర్మాణానికి రూ.60 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇప్పుడు దీనికి సుమారు రూ.100 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. జాప్యం కారణంగా రూ.40 కోట్లమేర హెచ్‌ఎండీఏపై అదనపు భారం పడింది. ఈ  కే సులో సుప్రీం తీర్పు అనుకూలంగా వచ్చినా కండ్లకోయ జంక్షన్‌లో వివిధ నిర్మాణాలు పూర్తి చేయడానికి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏదోవిధంగా సమస్యకు పరిష్కారం కనుగొని నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణం ప్రారంభించాలని వారు ప్రయత్నిస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement